Begin typing your search above and press return to search.

జీఎంఆర్ చేతికి గోల్కొండ కోట‌?

By:  Tupaki Desk   |   4 May 2018 7:21 AM GMT
జీఎంఆర్ చేతికి గోల్కొండ కోట‌?
X
భార‌త దేశపు సంస్కృతీ సంప్ర‌దాయాలకు, వార‌స‌త్వ క‌ట్ట‌డాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరుంది. మ‌న దేశంలోని చారిత్ర‌క క‌ట్ట‌డాల‌ను వీక్షించేందుకు ప్ర‌పంచం న‌లుమూల‌ల‌నుంచి ల‌క్ష‌లాది మంది ప‌ర్యాట‌కులు ప్ర‌తి ఏటా ప‌ర్య‌టిస్తుంటారు. అయితే, దేశంలోని చాలా క‌ట్ట‌డాలకు స‌రైన సంర‌క్ష‌ణ లేక క‌ళా విహీనంగా మారుతున్నాయి. దీనిని గుర్తించిన ప్ర‌భుత్వం ప్ర‌ముఖ చారిత్ర‌క క‌ట్ట‌డాల సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగానే గ‌త ఏడాది 'అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌' ప్రాజెక్ట్ ను కేంద్రం ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులో భాగంగా ఎర్రకోట - తాజ్‌ మహల్‌ - చార్మినార్‌ - గోల్కొండ కోట - కోణార్క్‌ సూర్య దేవాలయం వంటి 100 ప్ర‌ముఖ చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటీ (సీఎస్ ఆర్‌) చర్యల్లో భాగంగా చారిత్రక క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌లో కార్పొరేట్ సంస్థ‌ల‌నూ భాగ‌స్వామ్యం చేయాల‌ని కేంద్రం యోచించింది. ఆయా క‌ట్ట‌డాల బిడ్ ల‌ను ద‌క్కించుకున్న కార్పొరేట్ సంస్థ‌లు ....ఐదేళ్లపాటు వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా, హైద‌రాబాద్ లో ఉన్న గోల్కొండ కోట‌ను జీఎంఆర్ స్పోర్ట్స్ ద‌త్త‌త తీసుకునేందుకు బిడ్ వేసింది.

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాల ఆధ్వ‌ర్యంలో ప్రారంభించిన‌ 'అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌' కార్యక్రమంలో భాగ‌స్వామి అయ్యేందుకు ప‌లు కార్పొరేట్ దిగ్గ‌జాలు ముందుకు వ‌చ్చాయి. ఢిల్లీలోని చారిత్ర‌క ఎర్రకోటను దాల్మియా గ్రూపు దత్తత తీసుకుంది.

భాగ్యనగరానికే త‌ల‌మానిక‌మైన‌ చార్మినార్‌ను ఐటీసీ హోటల్స్ ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకొచ్చింది. గోల్కొండ కోట‌ను జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దత్తత తీసునేందుకు బిడ్ వేసింది. ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ దరఖాస్తు చేసుకోగా గోల్కొండ‌కు మాత్రమే అవ‌కాశం ద‌క్క‌నుంది. జీఎంఆర్ వేయ‌బోతోన్న విజన్‌ బిడ్ ను 'అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌ ప్రాజెక్ట్‌ ఓవర్‌ సైట్‌ అండ్‌ విజన్‌ కమిటీ' పరిశీలిస్తుంది. ఆ బిడ్‌ ఎంపికైతే ప్రభుత్వంతో జీఎంఆర్ ఎంఓయూ చేసుకోవాల్సి ఉంటుంది. చార్మినార్ కు ఐటీసీ - గోల్కొండ‌కు జీఎంఆర్ ల బిడ్లు దాదాపుగా ఖ‌రారైన‌ట్లేన‌ని తెలుస్తోంది.