Begin typing your search above and press return to search.

కేపిటల్ గా విశాఖే బెస్ట్..జీఎన్ రావు బల్ల గుద్దేశారు

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:27 PM GMT
కేపిటల్ గా విశాఖే బెస్ట్..జీఎన్ రావు బల్ల గుద్దేశారు
X
ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంను మించిన నగరం మరొకటి లేదని జీఎన్ రావు తేల్చి చెప్పేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ఎంపిక చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయానికి ప్రాతిపదిక జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదకలే కదా. అయితే ఇటు జీఎన్ రావు కమిటీ నివేదిక గానీ, అటు బోస్టన్ నివేదిక గానీ... విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా సిఫారసు చేయలేదని బుధవారం పలు ప్రధాన ప్రతికల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం స్వయంగా మీడియా ముందుకు వచ్చిన జీఎన్ రావు... తమ నివేదికలో ఇచ్చిన విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ నగరాన్ని మించినది మరొకటి లేదని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పేశారు.

ఈ సందర్భంగా జీఎన్ రావు ఏమన్నారన్న విషయానికి వస్తే.. ‘‘మా కమిటీ నివేదికపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన వార్తలు వాస్తవ విరుద్ధం. రాష్ట్రంలోని 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించాం. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఉండాలని నివేదికలో స్పష్టంగా చెప్పాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేం. కొందరు జీఎన్‌ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరం. నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నాం. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా పెట్టొద్దని చెప్పలేదు. కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించాం. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పాం. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ బెస్ట్‌ ఆప్షన్‌’’ అని జీఎన్ రావు స్పష్టం చేశారు.

జీఎన్ రావు ఇంకా ఏమన్నారంటే... మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించామని ఆయన చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కమిషనరేట్లలో సీనియర్‌ అధికారాలను నియమించి.. వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు పెడితే.. నాలుగు జిరాక్స్‌ సెంటర్లు మాత్రమే వస్తాయని అనడం చాలా తప్పని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్‌ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు - ఎస్పీలు - జిల్లా అధికారుల - వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. భౌతికంగా - ఆన్‌ లైన్‌ పద్ధతుల్లో అభిప్రాయాలు స్వీకరించామని.. ఆ తర్వాత డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషించామని తెలిపారు. మొత్తంగా టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలతో ఎంట్రీ ఇచ్చిన జీఎన్ రావు కమిటీ... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖే బెస్ట్ అని మరోమారు చెప్పేసింది.