Begin typing your search above and press return to search.

గోవాలో నైజీరియన్లు అలా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   1 Jun 2016 11:08 AM GMT
గోవాలో నైజీరియన్లు అలా చేస్తున్నారా?
X
నైజీరియన్లు అనగానే డ్రగ్స్.. కిడ్నాప్స్.. కేసులు.. ఇవే గుర్తుకొస్తాయి మనోళ్లకు. దేశంలోని అనేక నగరాల్లో స్థిరపడ్డ నైజీరియన్స్ మీద క్రిమినల్స్ అనే ముద్ర పడిపోయింది. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసుల్లో తరచుగా నైజీరియన్లు దొరకడం మామూలైపోయింది. మరోవైపు నానా జాతుల నిలయం.. అనేకమంది విదేశీయులు స్థిరపడ్డ పర్యాటక నగరం గోవాకు కూడా నైజీరియన్లతో తలనొప్పులు తప్పడం లేదు. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే నైజీరియన్లతో పడలేమంటూ దండం పెట్టేస్తున్నాడు. నైజీరియన్లలో చాలామంది కావాలనే కేసుల్లో ఇరుక్కుని ఆ సాకుతో ఇక్కడే ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారని గోవా మంత్రి ఒకరు అనడం విశేషం.

పర్యాటకులకు స్వర్గధామమైన గోవాలో నైజీరియన్ల ఆగడాలకు అంతులేకుండా పోతోందని.. వాళ్లు తమకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. తమ రాష్ట్రానికి చాలా దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారని.. ఐతే కేవలం నైజీరియన్ల వల్లే తమ రాష్ట్ర ప్రజలు బాగా ఇబ్బంది పడుతుున్నారని ఆయనన్నారు. చాలా సందర్భాల్లో నైజీరియన్ల మీద ఫిర్యాదులు తన దాకా కూడా వచ్చాయని తెలిపారు. గోవా వాసులు వీళ్లతో ఏమాత్రం సంతోషంగా లేరని.. వీరి ప్రవర్తన.. లైఫ్ స్టైల్.. వివాదాలతో జనాలు విసుగెత్తిపోయారని ఆయనన్నారు.

ఇటీవలే గోవాసమీపంలోని అసాగో అనే గ్రామంలో 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఓ నైజీరియన్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున గొడవ చెలరేగింది. నైజీరియన్లను గోవా నుంచి తరిమేయాలంటూ జనాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా స్పందించారు. నైజీరియన్లందరూ చెడ్డవాళ్లని తాను అనను కానీ.. వాళ్లలో చాలామంది గోవాకు ఇబ్బందిగా మారారని.. ఆయనన్నారు. వీళ్లు కావాలని ఏదో ఒక నేరం చేసి.. కేసులు పెట్టించుకుని ఎక్కువ కాలం ఇండియాలో ఉండిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ అంతకుముందు వ్యాఖ్యానించడం విశేషం.