Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా గోవా సీఎం అర్థ‌రాత్రి సాయం!

By:  Tupaki Desk   |   16 Jun 2019 5:14 AM GMT
వైర‌ల్ గా గోవా సీఎం అర్థ‌రాత్రి సాయం!
X
అర్థ‌రాత్రి 1.13 గంట‌ల‌కు మీకు ఫోన్ వ‌స్తే.. ఏం జ‌రుగుతుంది? మీకే కాదు.. ఎవ‌రికైనా స‌రే.. దాదాపుగా ఫోన్ లిఫ్ట్ చేసే అవ‌కాశం త‌క్కువ ఉంటుంది. కానీ.. రెండంటే రెండు రింగులకు ఫోన్ ఎత్త‌టం కాదు.. స‌మ‌స్య‌కు స్పందించి.. అధికార యంత్రాంగాన్ని ప‌రుగులు పెట్టించిన వైనం చూస్తే విస్మ‌యంతో షాక్ తినాల్సిందే. ఇంత‌కూ ఆ వేళ అంత‌లా రియాక్ట్ అయ్యింది ఎవ‌రో కాదు.. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రే. కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతం ఇప్పుడు వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. ప‌లువురి నోట హాట్ టాపిక్ గా మారింది.

ఇక‌.. స‌ద‌రు రాష్ట్రంలో అయితే సీఎంగారి ఇమేజ్ రాత్రికి రాత్రి మారిపోయింది. ఇంత‌కూ ఆ ముఖ్య‌మంత్రి మ‌రెవ‌రో కాదు గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్‌. గోవా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన మ‌నోహ‌ర్ పారీక‌ర్ అకాల మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న స్థానంలో వ‌చ్చిన ప్ర‌మోద్ సావంత్ స్పందించిన‌తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకోవ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను ప‌లువురు అభినందిస్తున్నారు.

ముంబ‌యి నుంచి గోవాకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రాత్రి 9.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరాల్సి ఉంది. అయితే.. నాలుగు గంట‌ల ఆల‌స్యంగా బ‌య‌లుదేరింది. డిన్న‌ర్ గోవాలో చేద్దామ‌నుకున్న వారికి షాకిస్తూ ఎయిరిండియా సిబ్బంది తీరుతో ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇలాంటివేళ‌.. అదే విమానంలో ప్ర‌యాణిస్తున్నారు బీజేపీ మిత్ర‌ప‌క్షానికి చెందిన గోవా ఫార్వార్డ్ పార్టీ నేత కేత‌న్ భాటిక‌ర్. విమానం ఆల‌స్యం గురించి.. ప్ర‌యాణికులు ప‌డుతున్న ఇబ్బంది గురించి గోవా ముఖ్యమంత్రి ప్ర‌మోద్ కు చెప్పేందుకు ఆయ‌న అర్థ‌రాత్రి 1.13 గంట‌ల వేళ‌లో ఫోన్ చేశారు. రెండో రింగ్ కే ఫోన్ ఎత్తిన గోవా ముఖ్య‌మంత్రి.. భాటిక‌ర్ చెప్పిన స‌మ‌స్య తీవ్ర‌త‌ను అర్థం చేసుకున్నారు.

సీఎంకు ఫోన్ చేసిన 14 నిమిషాల్లో ఇండియ‌న్ క‌బాబ్ గ్రిల్ నుంచి ప్ర‌యాణికులంద‌రికి భోజ‌నం ఏర్పాటు చేయ‌ట‌మే కాదు.. మ‌రో అర‌గంట‌కు విమానం బ‌య‌లుదేరేలా చేశారు.అప్ప‌టివ‌ర‌కూ ఆక‌లితో.. ఆల‌స్యంతో తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌యాణికులు గోవా సీఎం స్పంద‌న‌కు ఫిదా అయ్యారు. ఢిల్లీలో జ‌రుగుతున్న నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొన‌టం కోసం దేశ రాజ‌ధానిలో ఉండి కూడా గోవా ప్ర‌యాణికుల విష‌యంలో సీఎం వ్య‌వ‌హ‌రించిన తీరును ప‌లువురు అభినందిస్తున్నారు. ఈ విమానం చివ‌ర‌కు గోవాకు 3.30 గంట‌ల‌కు చేరుకుంది. ఈ విష‌యాన్ని బీజేపీ మిత్ర‌ప‌క్ష నేత భాటిక‌ర్ బ‌య‌ట‌పెట్ట‌టంతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాయం చేసి.. మైలేజీ ఆశించకుండా చేయ‌టానికి మించింది లేదు. ఏమైనా ప్ర‌మోద్ సావంత్ గ్రేట్ క‌దూ?