Begin typing your search above and press return to search.

కర్ణాటకలో గొర్రెలకు..మేకలకు ఆ పరీక్షలు..ఎందుకు?

By:  Tupaki Desk   |   1 July 2020 5:15 AM GMT
కర్ణాటకలో గొర్రెలకు..మేకలకు ఆ పరీక్షలు..ఎందుకు?
X
మనుషుల్ని ఆగమాగం చేస్తున్న మాయదారి రోగం.. జంతువుల్లో కనిపించిన దాఖలాలు తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా చూసినా చాలా తక్కువగానే ఇలాంటివి చోటు చేసుకున్నాయి. అలాంటి పరిస్థితికి భిన్నంగా కర్ణాటకలో ఒక సందేహం అధికారుల్ని పరుగులు తీసేలా చేసింది. రాష్ట్రంలోని తమకూరు ప్రాంతంలోని చిక్కనాయకనహళ్లిలో కొన్ని గొర్రెలు.. మేకలకు కరోనా పరీక్షలు చేశారు.

మనుషులకే సరిగా పరీక్షలు చేయని వేళ.. గొర్రెలకు.. మేకలకు ఎందుకు చేస్తున్నట్లు? అన్న సందేహం రాక మానదు. దీనికో కారణం లేకపోలేదు. పరీక్షలు చేసిన మేకల యజమానికి ఇటీవల పరీక్షలు జరపగా.. అతనికి పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో.. అతడి దగ్గరున్న యాభై గొర్రెలు.. మేకల్లో కొన్ని.. శ్వాస తీసుకోవటానికి తీవ్ర అవస్థలు పడుతున్న వైనాన్ని గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆ గొర్రెలు.. మేకల్ని ఐసోలేషన్ కు తరలించారు.

వాటి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటివరకూ మనుషుల ద్వారా గొర్రెలకు.. మేకలకు మహమ్మారి సోకినట్లుగా ఎక్కడా వార్తలు వచ్చింది లేదు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో పరీక్షలు చేపట్టారు. వీటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఒకవేళ..లెక్క తేడా చోటు చేసుకొని.. రిజల్ట్ పాజిటివ్ వస్తే మాత్రం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.