Begin typing your search above and press return to search.

కన్నీరు తెప్పించే ఘటన: మృతదేహం దొరక్కుండానే కూతురు కర్మకాండ

By:  Tupaki Desk   |   26 Sep 2019 10:33 AM GMT
కన్నీరు తెప్పించే ఘటన: మృతదేహం దొరక్కుండానే కూతురు కర్మకాండ
X
సరిగా 12 రోజుల క్రితం గోదావరి నదిలో హృదయ విదారకరమైన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాపికొండలకు విహార యాత్రకు వెళ్ళిన బోటు గోదావరి సుడిలో మునిగిపోయి 34 మంది మృత్యువాత పడగా - 14 మంది గల్లంతు అయిపోయారు. ఇక 26 మందిని స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అటు మునిగిపోయిన బోటుని పైకి తీసుకురాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమవారు మరణించి ఉంటారని బాధిత కుటుంబాలు నిర్ధారణకు వచ్చేశారు.

ఈ క్రమంలోనే తమ కుమార్తె ఆచూకీ లభ్యం కానప్పటికి ఓ తండ్రి ఆమెకు కర్మకాండలు జరిపించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మంచిర్యాలకు చెందిన యువ ఇంజనీర్ రమ్యశ్రీ తండ్రి తన కూతురికి శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. పది రోజులు దాటినా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో అతను రాజమండ్రిలోని కోటి లింగాల ఘాట్‌ వద్ద కర్మకాండలు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె గురించి మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. రమ్యశ్రీ పట్టుదలతో విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గా ఉద్యోగం సాధించిందని - తొలి నెల వేతనాన్ని అందుకున్న ఆమె - అందులో నుంచి కొంత మొత్తాన్ని భద్రాచలం ఆలయానికి సమర్పించాడానికి వెళ్లిందని చెప్పారు. అనంతరం తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరానికి వెళ్లారని, ఆ తర్వాత పాపికొండల పర్యటనకు వెళ్తున్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిందని, ఇక అదే చివరి ఫోన్ కాల్ అయిందని ఆ తండ్రి ఆవేదన చెందుతూ చెప్పారు.

అలాగే బోటు వెలికితీత చర్యలను నిలిపివేయడంపై ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రమాదంలో మునిగిపోతే బోటుని గోదావరిలో అలాగే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. 11 రోజులైన కూతురు మృతదేహం కూడా దొరక్కపోవడంపై తీవ్ర ఆవేదన చెందారు.