Begin typing your search above and press return to search.

వ‌ర‌ద‌ల్లోనూ గోదారోళ్ల జోష్ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   22 July 2022 8:31 AM GMT
వ‌ర‌ద‌ల్లోనూ గోదారోళ్ల జోష్ మామూలుగా లేదుగా!
X
ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు వాన‌లు, వ‌ర‌ద‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో వాగులు, వంక‌లు, ఉప‌న‌దులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావ‌రి, కృష్ణా న‌దుల్లోకి పెద్ద ఎత్తున వ‌ర‌ద చేరుతోంది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కాకినాడ‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, ఏలూరు, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలు గోదావ‌రి వ‌ర‌ద ముంపులో చిక్కుకున్నాయి. గ‌త 30 ఏళ్ల‌లో లేనంత వ‌ర‌ద ప్ర‌వాహం రావ‌డంతో రాజ‌మండ్రి స‌మీపంలోని ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి 25.80 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని స‌ముద్రంలోకి విడిచిపెట్టారు.

మ‌రోవైపు వ‌ర‌ద‌ల‌తో ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో పంట‌లు, లోత‌ట్టు ప్రాంతాలు, ఇళ్లు నీట‌మునిగాయి. ముఖ్యంగా గోదావ‌రి మ‌ధ్య‌లో స‌హ‌జ‌సిద్ధంగా ఏర్ప‌డిన కోన‌సీమ ప్రాంతంలో వ‌ర‌ద‌లు ఇబ్బందులు ప‌డుతున్నాయి. అయినా స‌రే వెట‌కారానికి, సునిశిత హాస్యానికి పెట్టింది పేరైన గోదావ‌రి వాసులు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

కోన‌సీమ‌లో గోదావ‌రి ఒడ్డున ఉన్న రిసార్ట్స్ మోకాళ్ళ లోతులో మునిగిపోయినా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడం మానలేదు. ఏకంగా మోకాళ్ళ లోతు నీళ్లలోనే బల్లలు వేసుకుని స్నేహితులతో తింటూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇది ఏ ప్రాంతంలో జరిగిందో గానీ, గోదావరి నీటిలో ఇలా ఎంజాయ్ చేయడం మాత్రం గోదారోళ్ళకు మాత్రమే సాధ్యమైంది అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. జూలై 21న‌ పి.గన్నవరం లో పీకల్లోతు నీళ్లలో వాలీబాల్ ఆడిన యువకులు ఇప్పుడు ఇలా గోదావరి నీళ్లలో ఏకంగా పార్టీనే చేసుకుని మ‌స్తు ఎంజాయ్ చేస్తున్నారు. త‌ద్వారా వ‌ర‌ద‌లు, గిర‌ద‌లు జాన్తా నై అని నిరూపిస్తున్నారు.

సాధార‌ణంగా ఆగ‌స్టు నెల‌లో గోదావ‌రికి వ‌ర‌ద‌లుంటాయి. కానీ ఈసారి జూలై నెలలోనే తెలుగు రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపించాడు. జూలైలో దాదావు వారం రోజుల పాటు కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీ కంటే తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది.

ముఖ్యంగా గోదావరి న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. రికార్డ్ స్థాయిలో వరదొచ్చింది. ప్ర‌స్తుతం వ‌ర‌ద కొంచెం త‌గ్గినా ఇంకా ప‌లు గ్రామాలు జ‌ల‌దిగ్భందంలోనే ఉన్నాయి.