Begin typing your search above and press return to search.

ఆదివారం అదే ర‌ద్దీ.. అవే క‌ష్టాలు

By:  Tupaki Desk   |   19 July 2015 9:41 AM GMT
ఆదివారం అదే ర‌ద్దీ.. అవే క‌ష్టాలు
X
గోదావ‌రి పుష్క‌రాల మొద‌టి వీకెండ్ భ‌క్తుల‌కు విప‌రీత‌మైన క‌ష్టాల్ని తెచ్చిపెడుతోంది. ప‌న్నెండు రోజుల పాటు సాగే పుష్క‌రాల్లో ఆరో రోజైన ఆదివారం సైతం తీవ్ర ర‌ద్దీ నెల‌కొంది. ఏపీ.. తెలంగాణ‌లోని అన్ని పుష్క‌ర‌ఘాట్లు భ‌క్తుల‌తో కిక్కిరిపోతున్నాయి.

శ‌నివారం మాదిరే పుష్క‌ర ఘాట్లు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. భారీగా భ‌క్తుల రాక‌తో ర‌హ‌దారుల‌న్నీ కిక్కిరిపోతున్న ప‌రిస్థితి. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్‌ల‌తో యాత్రికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ‌నివారం మాదిరే.. ఆదివారం కూడా భ‌క్తులు పెద్ద ఎత్తున పుష్క‌ర ఘాట్ల‌కు వ‌స్తుండ‌టంతో ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌టం లేదు. రోడ్ల మీద‌కు భారీగా వాహ‌నాలు రావ‌టం.. ర‌ద్దీ కార‌ణంగా అధికారులు సైతం ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి.

తెలంగాణ‌లోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు చోటు చేసుకున్నాయి. క‌రీంన‌గ‌ర్‌లో 15 కిలోమీట‌ర్ల దూరానికి 3.30గంట‌లు ప‌డుతున్న‌ది. అదే తీరులో భ‌ద్రాచ‌లంలోనూ ఇదే ప‌రిస్థితి. వారాంతం కావ‌టంతో మ‌ళ్లీ వ‌చ్చే వారాంతానికి పుష్క‌రాలు ముగిస్తున్నందున భ‌క్తుల ర‌ద్దీ తీవ్రంగా ఉంది.

ఇక‌.. ఆంధ్రాలోనూ భ‌క్తుల ర‌ద్దీ భారీగా ఉంది. రాజ‌మండ్రి రైల్వే స్టేష‌న్లో భ‌క్త‌కోటితో కిట‌కిట‌లాడుతోంది. ర‌ద్దీ తీవ్రంగా ఉండ‌టం.. రైళ్ల‌ల్లో చోటు దొర‌క్క‌పోవ‌టం.. ఆల‌స్యంగా న‌డుస్తుండ‌టంతో భ‌క్తులు తీవ్ర ఇక్క‌ట్ల‌కు గురి అవుతున్నారు.

సెల‌వు దొర‌క‌ద‌న్న ఉద్దేశంతో ఎలాగైనా పుష్క‌ర స్నానం చేయాల‌న్న త‌ప‌న ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం కావ‌టంతో యాత్రికులు తీవ్ర క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా.. భ‌క్త కోటి ప్ర‌భంజ‌నంతో ఏర్పాట్లు వెల‌వెల పోతున్న ప‌రిస్థితి. మొత్తంగా శ‌నివారం మాదిరే ఆదివారం కూడా పుష్క‌ర స్నాన ప్ర‌యాణం ఇక్క‌ట్ల మ‌యంగానే మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.