Begin typing your search above and press return to search.

ఏపీలో పుష్కరాలు... ఒడిశాలో రథయాత్ర

By:  Tupaki Desk   |   18 July 2015 10:10 AM GMT
ఏపీలో పుష్కరాలు... ఒడిశాలో రథయాత్ర
X
కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండగా పొరుగునే ఉన్న ఒడిశాలో రథయాత్రకు కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వరుసగా మూడు రాష్ట్రాల్లో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుండడంతో ఎటుచూసినా ఉత్సవ వాతావరణమే కనిపిస్తోంది. పుష్కరాలు, రథయాత్ర కారణంగా రైల్వే వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

ఈ శతాబ్దపు అతిపెద్ద రథయాత్ర పూరీలో ప్రారంభమైంది. బలభద్ర, సుభద్ర సమేతుడై జగన్నాథుడు పూరీ పురవీధుల్లో భక్తులకు కనువిందు చేశాడు. జగన్నాథుడి రథయాత్రను సుమారు 40 లక్షల మంది కనులారా వీక్షిస్తున్నారు. ఏటా జరిగే రథయాత్ర కాకుండా ఈసారి జగన్నాథుడిని కొత్త దేహంలోకి మార్చడంతో నవకళేబర యాత్రగా చెబుతారు. ఈ సహస్రాబ్దిలోనే ఇది తొలి నవకళేబర యాత్ర కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష విదియ నాడు మొదలై... తొమ్మిది రోజుల తర్వాత ఆషాడ శుక్ల దశమితో రథయాత్ర వేడుకలు ముగుస్తాయ్. జగన్నాథుడు కొలువైన గరుడ వాహనాన్ని(రథాన్ని) 832 చెక్కలతో నిర్మించారు. దీనికి మొత్తం 16 చక్రాలు ఉంటాయి. 44.2 అడుగుల ఎత్తుండే జన్నాథుడి రథాన్ని ఎరుపు, పసుపు రంగు వస్త్రాలతో అలంకరించారు.. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహ మూర్తుల్ని వేర్వేరు రథాలపై ఉంచి ఊరేగిస్త‌న్నారు. రథయాత్ర ప్రతిరోజు రెండు కిలోమీటర్ల పాటు గుండిచా దేవాలయం వరకూ సాగుతుంది. జగన్నాథ రథయాత్రను గుండిచ యాత్ర, గోశాయాత్ర, నవదియ యాత్ర, దేవస్థాన యాత్ర అని కూడా పిలుస్తారు.

జగన్నాథ రథయాత్రలో లక్షలాదిగా పాల్గొనే భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఒడిషా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మలాటీపూర్ బస్ స్టేషన్ నుంచి పూరీకి ఉచిత బస్సు సర్వీసులను నడుపుతున్నారు. రైల్వే శాఖ కూడా దేశంలోని ప్రధాన ప్రాంతాల నుంచి 216 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రథయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల క్రితమే పూరి పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు, ఈ వేడుకకు దాదాపు 40 లక్షల మంది ప్రజల హాజ‌ర‌య్యారు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసింది.