Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ వ‌శిష్ట స‌క్సెస్‌...38 రోజుల నిరీక్ష‌ణ‌కు తెర‌!

By:  Tupaki Desk   |   22 Oct 2019 9:57 AM GMT
ఆప‌రేష‌న్ వ‌శిష్ట స‌క్సెస్‌...38 రోజుల నిరీక్ష‌ణ‌కు తెర‌!
X
నెల రోజుల‌కు పైగా సాగిన బోటు ఆప‌రేష‌న్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. సెప్టెంబ‌ర్ 15న గోదావ‌రి న‌దిలో మునిగిపోయిన బోటును గోదావ‌రి నది నుంచి బ‌య‌టి తీశారు ధ‌ర్మాడి స‌త్యం బృందం - ఆప‌రేష‌న్ వ‌శిష్ట చేప‌ట్టిన రెండో విడ‌త‌లో బోటును బ‌య‌ట‌కు తీసిన ధ‌ర్మాడి స‌త్యం త‌న పంతాన్ని నెగ్గించుకున్నారు. గోదావ‌రి న‌దిలో పాపికొండ‌ల యాత్ర‌లో సంద‌ర్భంగా ప‌ర్యాట‌కుల‌తో వెళుతున్న వ‌శిష్ట బోటు సెప్టెంబ‌ర్ 15న తూర్పుగోదావ‌రి జిల్లా దేవీప‌ట్నం మండ‌లం క‌చ్చ‌లూరు వ‌ద్ద మునిగిపోయింది. ఈ బోటు మున‌క‌లో ప‌ర్యాట‌కులు మృత్యువాత ప‌డ్డారు. అనేక‌మంది గ‌ల్లంతు అయ్యారు. గ‌ల్లంతు అయిన‌వారి కోసం ఆప‌రేషన్ వ‌శిష్ట చేప‌ట్టారు.

అంత‌కు ముందు జాతీయ రెస్క్యూ టీం ఎంత ప్ర‌య‌త్నించినా బోటును గుర్తించ‌లేక పోయారు. కానీ ధ‌ర్మాడి స‌త్యం త‌న‌కు అవ‌కాశం ఇస్తే బ‌య‌టికి తీస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఇంత‌కు ముందు ఓ విడ‌త తీవ్రంగా శ్ర‌మించారు. అప్పుడు భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో గోదావ‌రి న‌దిలో భారీగా వ‌ర‌ద రావ‌డంతో ఆప‌రేష‌న్ ముందుకు సాగ‌లేదు. దీంతో రెండో విడ‌త‌గా గ‌త ఆరు రోజులుగా ధ‌ర్మాడి స‌త్యం బృందం తీవ్రంగా శ్ర‌మించింది. గోదావ‌రిలో నీటి మ‌ట్టం త‌గ్గ‌డంతో ధ‌ర్మాడి స‌త్యం టీం ముందుగా బోటు జాడ‌ను క‌నుగొన్నారు.

బోటు జాడ క‌నుగొన్నాక లంగ‌ర్లు త‌గిలించి బ‌య‌టికి లాగేందుకు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా సాధ్యం కాలేదు. అయితే ధ‌ర్మాడి స‌త్యం బృందానికి తోడు గ‌జ ఈత గాళ్ళ‌ను రంగంలోకి దింపారు. అయితే బుధ‌వారం రోజున లంగ‌ర్‌ను బోటుకు గ‌జ ఈత‌గాళ్ళు త‌గిలించారు. లంగ‌ర్ సాయంతో పైకి లాగారు. కానీ బోటు పైభాగం ఊడి వ‌చ్చింది. దీంతో ఆప‌రేష‌న్ ఆరో రోజు నిలిచిపోయింది. ఇక ఈ రోజు బోటును ఎలాగైనా పైకీ తేవాల‌ని తీవ్రంగా శ్ర‌మించారు. ధ‌ర్మాడి స‌త్యం మాత్రం బోటు బ‌య‌ట‌కు తీయాల‌న్న పంతంతోనే ఉన్నారు.

ఎట్ట‌కేల‌కు స‌త్యం నాయ‌క‌త్వంలో కెప్టెన్ ఆదినారాయ‌ణ నేతృత్వంలోని బృందం బోటుకు గ‌జ ఈత‌గాళ్ళ‌తో కింది భాగంలో లంగ‌ర్లు త‌గిలించి పైకి లాగారు. ఎట్ల‌కేల‌కు ఈరోజు బోటు మొత్తం ఒడ్డుకు చేరింది. దీంతో ఆప‌రేష‌న్ వ‌శిష్ట విజ‌య‌వంతం అయింది. ఇంత‌కాలం బోటు మున‌క‌పై వ‌చ్చిన రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌కు ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ కావ‌డంతో తెర‌దించిన‌ట్లు అయింది.