Begin typing your search above and press return to search.

జ‌పాన్ లో ఒక సిటీ పేరు ల‌క్ష్మీదేవి ఆల‌యం

By:  Tupaki Desk   |   13 Aug 2018 7:22 AM GMT
జ‌పాన్ లో ఒక సిటీ పేరు ల‌క్ష్మీదేవి ఆల‌యం
X
ల‌క్ష్మీదేవి ఆల‌యం.. అన్నంత‌నే ఓకే.. గుడి అనేసుకుంటారు. కానీ.. అది త‌ప్పు. మీరేమాత్రం ఊహించ‌ని విధంగా జ‌పాన్ దేశంలోని ఒక న‌గరానికి పేరు. నిజ‌మా? అనిపించినా.. ఇది నిజ‌మే. ఎందుకంటే.. ఆ విష‌యాన్ని జ‌పాన్ కు చెందిన ఒక అధికారే స్వ‌యంగా వెల్ల‌డించారు మ‌రి. హిందూ దేవ‌త అయిన ల‌క్ష్మీదేవిని ఒక న‌గ‌రానికి పేరుగాపెట్టిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆ పేరు ఎందుకు పెట్టారు? అస‌లు ఆ విష‌యం బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చింద‌న్న‌ది చూస్తే..

బెంగ‌ళూరులోని ద‌యానంద్ సాగ‌ర్ కాలేజీలో తాజాగా గ్రాడ్యుయేష‌న్ వేడుక‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి జ‌పాన్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ ట‌క‌యుకి కిట‌గ‌వా విచ్చేశారు. ఆయ‌న మాట్లాడే క్ర‌మంలో జ‌పాన్ దేశంలోని ఒక న‌గ‌రానికి తాము కిచిజోజి అనే పేరు పెట్టిన‌ట్లుగా చెప్పారు. ఇంత‌కీ ఆ పేరుకు అర్థం ఏమిటో తెలుసా? ల‌క్ష్మీదేవి ఆల‌యం.

జ‌పాన్ లోని సంస్కృతి సంప్ర‌దాయాల‌తో పాటు.. అక్క‌డి స‌మాజంలో భార‌తీయుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. జ‌పాన్.. భార‌త్ వేర్వేరు దేశాలే అయినా.. త‌మ దేశ సంస్కృతిలో భార‌తీయ‌త చాలా బాగా క‌లిసిపోయింద‌న్నారు.

త‌మ దేశంలో ఎన్నో హిందూ దేవాల‌యాలు ఉన్నాయ‌ని.. ఎన్నో ఏళ్లుగా తాము హిందూ దేవుళ్ల‌ను పూజిస్తున్న‌ట్లుగా చెప్పారు. త‌మ భాష‌పై కూడా భార‌త భాష‌ల ప్ర‌భావం ఉంద‌ని చెప్పారు. దాదాపు 500ల‌కు పైగా జ‌ప‌నీస్ ప‌దాలకు మూలం సంస్కృతం.. త‌మిళం నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు.

ఇక‌.. టోక్యోకు స‌మీపంలో ఉన్న సిటీకి ల‌క్ష్మీదేవి ఆల‌య‌మ‌ని పేరు పెట్ట‌టానికి కార‌ణం చూస్తే.. ఆ సిటీలో పెద్ద ల‌క్ష్మీదేవి టెంపుల్ ఉంద‌ని.. దాని గుర్తుగానే తామీ పేరు పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశం కాని దేశంలో ఒక న‌గ‌రానికి ల‌క్ష్మీదేవి పేరు పెట్ట‌టం నిజంగా గ్రేట్ క‌దూ!