Begin typing your search above and press return to search.

కరెన్సీ నోట్ల మీద లక్ష్మీదేవి బొమ్మ.. వాటే లాజిక్ స్వామీ?

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:34 AM GMT
కరెన్సీ నోట్ల మీద లక్ష్మీదేవి బొమ్మ.. వాటే లాజిక్ స్వామీ?
X
పిచ్చ పలు రకాలు అని ఊరికే అనలేదు. మేధావి మాష్టారిగా పేరున్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తన మాటలతో అప్పుడప్పడు తాను కాషాయ తానులో ముక్కను కాదన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ.. అది నిజం కాదన్న విషయాన్ని ఆయన తాజా వ్యాఖ్యలో స్పష్టం చేశారని చెప్పాలి. ఎంత మేధావి అయితే మాత్రం మరీ ఇంత పిల్లాడిలా మాట్లాడతారా? అని సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యల పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

దేశీయ కరెన్సీ మీద లక్ష్మీదేవి బొమ్మను ప్రింట్ చేయాలని.. దాంతో మేలు జరుగుతుందంటూ సిత్రమైన సూచన చేశారు సుబ్రమణ్య స్వామి. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన.. భారత కరెన్సీ మీద లక్ష్మీదేవి బొమ్మను ప్రింట్ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపైన ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు.

అదే సమయంలో ఆ ప్రచారానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. భారతీయ కరెన్సీ మీద లక్ష్మీదేవి బొమ్మను ప్రింట్ చేయటం కారణంగా మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో గణేశుని బొమ్మను ముద్రించే విషయాన్ని ప్రస్తావించిన సుబ్రమణ్య స్వామి.. గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని.. అదే రీతిలో లక్ష్మీదేవి బొమ్మను ప్రచురిస్తే.. రూపాయి దశ తిరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

లక్ష్మీదేవి బొమ్మ వేస్తే.. రూపాయి దశ మారుతుందేమో? దీన్ని ఎవరూ చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే.. కరెన్సీ నోట్ల మీద లక్ష్మీదేవి బొమ్మను వేస్తే తనకు అభ్యంతరం లేదన్న మాటను స్వామి తనకు తానుగా తెర మీదకు తెచ్చింది కాదు. మీడియా ప్రతినిదులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తాంశంగా మార్చిందని చెప్పాలి.