Begin typing your search above and press return to search.

గోద్రా కేసు..ఎట్ట‌కేల‌కు కీల‌క తీర్పు

By:  Tupaki Desk   |   28 Aug 2018 4:31 AM GMT
గోద్రా కేసు..ఎట్ట‌కేల‌కు కీల‌క తీర్పు
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి గోద్రా రైలు ఘ‌ట‌నలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. గోద్రా రైలుకు నిప్పు అంటించిన కేసులో.. ఇవాళ ప్రత్యేక సిట్ కోర్టు ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. నిందితులు ఫారూక్ బహనా - ఇమ్రాన్ షెరూలకు జీవితకాల శిక్షను విధిస్తూ ప్రత్యేక జడ్జి హెచ్‌ సీ వోరా తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 27 - 2001లో సబర్మతి రైలులోని రెండు బోగీలకు నిప్పు అంటించిన కేసులో ఇవాళ కోర్టు ఇద్దర్ని దోషులుగా తేల్చింది. అయితే ఇదే కేసులో మరో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. హుస్సేన్ సులేమాన్ మోహన్ - కసమ్ బామేడి - ఫారుక్ దాంటియాలను కోర్టు నిర్దోషులుగా తేల్చింది.

2002 - ఫిబ్రవరి 27న గోద్రాలో సబర్మతి ఎక్స్‌ ప్రెస్ ఎస్-6 బోగీని దగ్ధం చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. బోగీ దగ్ధం అనంతరం గుజరాత్‌ లో చెలరేగిన అర్లర్ల కారణంగా సుమారు వెయ్యి మందికి పైగా మృతి చెందారు. 2011లో ప్రధాన నిందితుడు మౌల్వీ ఉమర్జీతో పాటు 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 31 మందిని దోషులుగా ప్రకటించి.. ఇందులో 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో 20 మందికి జీవితఖైదు విధించింది కోర్టు. ఉరిశిక్ష విధించిన 11 మంది దోషులకు జీవిత ఖైదు విధిస్తూ గ‌త ఏడాది గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా ఇచ్చిన తీర్పులో జీవిత ఖైదు ఖ‌రారు చేసింది. కాగా, 2015 నుంచి ఈ అయిదుగుర్ని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. సబర్మతి సెంట్రల్ జైలులో ఈ కేసు విచారణ జరిగింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 8 మంది పరారీలో ఉన్నారు.