Begin typing your search above and press return to search.

మ‌ర్డ‌ర్ చేయించిన మ‌రో బాబా అరెస్ట్‌

By:  Tupaki Desk   |   17 Sep 2017 4:24 AM GMT
మ‌ర్డ‌ర్ చేయించిన మ‌రో బాబా అరెస్ట్‌
X
బాబాల ఆరాచ‌కం ఎంత‌లా ఉంటుందో ఇటీవ‌ల జైలుశిక్ష ప‌డిన గుర్మీత్ అలియాస్ డేరా బాబా ఉదంతాన్ని చూసిన‌ప్పుడు చాలామందికి అర్థ‌మైంది. అధ్యాత్మిక‌త‌ను అడ్డం పెట్టుకొని చెల‌రేగిపోయే బాబాలు ఎంత దారుణానికి పాల్ప‌డ‌తార‌న్న విష‌యం డేరాబాబా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తాజాగా మ‌రో బాబా గుట్టు ర‌ట్టైంది. అత‌గాడి పాపం పండి.. పోలీసుల చేతికి చిక్కాడు.

డ‌బ్బు కోసం హ‌త్య‌లు చేయించే ఈ బాబా పేరు ముచ్చేంద్ర‌నాథ్ అలియాస్ ప్ర‌తిభానంద్ బాబా. మ‌హారాష్ట్రకు చెందిన ఈ బాబా ఆశ్ర‌మం నిర్మాణం కోసం ఒక మ‌ర్డ‌ర్ చేయించ‌టానికి ఓకే చెప్పేశాడు. చిన్న‌త‌నంలోనే ఢిల్లీకి పారిపోయిన ఇత‌గాడు కాల‌క్ర‌మంలో ఒక గుడిలో బాబా అవ‌తారం ఎత్తాడు.

త‌న ఆశ్ర‌మ నిర్మాణం కోసం హ‌త్యా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్ర‌మంలో 2009లో బీఎస్పీ నేత భ‌ర‌ద్వాజ్ కుమారుడు నితేశ్ ఈ బాబాకు త‌న తండ్రిని హ‌త్య చేసే బాధ్య‌త‌ను అప్ప‌జెప్పాడు. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రిగితే రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. ఇందులో రూ.2కోట్ల మొత్తంలో హ‌రిద్వార్ లో ఒక ఆశ్ర‌మాన్ని నిర్మించాల‌న్న కోర్కెను బ‌య‌ట‌పెట్టాడు.

ఇంత‌కీ.. త‌న తండ్రిని చంపుకునే వర‌కూ స‌ద‌రు బీఎస్పీ నేత ఎందుకు వెళ్లాడంటే.. 2009నాటి యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో అత్యంత ధ‌నికుడిగా పేరొందిన భ‌ర‌ద్వాజ్ త‌న ఆస్తుల విలువ రూ.600 కోట్లుగా స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించుకున్నాడు. అయితే.. ఆ ఆస్తిని కొడుకు పంచే విష‌యంలో జ‌రిగిన లొల్లితో.. తండ్రి మీద ప‌గ పెంచుకున్నాడు కొడుకు.

ఇదే టైంలో దొంగ‌బాబా ప‌రిచ‌యం పుణ్యమా అని త‌న తండ్రిని హ‌త్య చేయ‌మ‌ని కోర‌టం.. రూ.5కోట్ల ఆఫ‌ర్ తో త‌న‌కు తెలిసిన కిరాయి వ్య‌క్తుల‌తో హ‌త్య చేయించాడు. ఢిల్లీలోని రాజోక్రిలో ఉన్న నితేశ్‌ కుంజ్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో భ‌ర‌ద్వాజ్ ను హ‌త్య చేయించాడు. నాటి నుంచి ఈ ప్ర‌తిభానంద్ బాబా ప‌రారీలో ఉన్నారు. కిరాయి వ్య‌క్తుల‌తో త‌న తండ్రిని బాబా సాయంతో హ‌త్య చేయించిన విష‌యాన్ని నితేశ్ అంగీక‌రించాడు. దీంతో ప్ర‌తిభానంద బాబా కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌ల్ని ముమ్మ‌రం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. దొంగ బాబా ఆచూకీ చెప్పినోళ్ల‌కు రూ.ల‌క్ష న‌జ‌రానా ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.

ఇద‌లా ఉంటే.. ప్ర‌తిభానంద్ ఆచూకీపై పోలీసుల‌కు స‌మాచారం అందింది. వెంట‌నే అలెర్ట్ అయిన పోలీసులు దొంగ‌బాబాను ఘ‌జియాబాద్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద అదుపులోకి తీసుకున్నారు. బాబా నుంచి ఒక పిస్ట‌ల్ స్వాధీనం చేసుకున్నారు. తాను చేయించిన హ‌త్యను ఒప్పేసుకున్నాడు. ఢిల్లీలోని ఒక గుడిలో ఆయుర్వేద మందుల్ని అమ్మేవాడిన‌ని.. ఒక లాయ‌ర్ ద్వారా భ‌ర‌ద్వాజ్ చిన్న కొడుకు నితేశ్ ప‌రిచ‌య‌మ‌య్యాడ‌ని.. ఆ త‌ర్వాత రూ.5కోట్ల కోసం హ‌త్య చేయించాన‌ని వెల్ల‌డించాడు. మ‌రీ.. దొంగ బాబాకు చ‌ట్టం ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.