Begin typing your search above and press return to search.

నిత్యానంద‌ పై సీబీఐ విచార‌ణ‌?

By:  Tupaki Desk   |   27 Nov 2019 3:58 PM GMT
నిత్యానంద‌ పై సీబీఐ విచార‌ణ‌?
X
వివాదాస్ప‌ద నిత్యానంద స్వామి మ‌ళ్లీ సంచ‌ల‌న రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. తమ ఇద్దరు కూతుళ్లను నిత్యానంద స్వామి అహ్మదాబాద్‌ లోని తన సర్వజన ఆశ్రమంలో బంధించాడని బెంగళూరుకు చెందిన జనార్ధనస్వామి దంపతులు ఆరోపించ‌డం - నిత్యానంద ఆశ్రమం నుంచి తమ కుమార్తెలను తమకు అప్పగించేందుకు ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయ‌డం సంచ‌ల‌నంగా మారిన త‌రుణంలోనే...తన కుమార్తెను హింసించి - దారుణంగా హత్య చేశారని ఝాన్సీ రాణి అనే మహిళ ఆరోపించారు. 2014లో నిత్యానంద ఆశ్రమంలో నిత్యానంద బెంగళూరు ఆశ్రమంలో తన కుమార్తె సంగీత అర్జున్‌ ను అక్రమంగా బంధించి - హత్య చేశారని పేర్కొన్న‌ట్లు ఇండియాటుడే టీవీ సంచ‌ల‌న క‌థనం వెలువ‌రించింది.

తిరుచ్చికి చెందిన సంగీత నిత్యానంద బెంగళూరు ఆశ్రమంలో కంప్యూటర్ విభాగానికి హెడ్‌ గా పనిచేసేది. ఆమెను క‌లిసేందుకు ఝాన్సీరాణి - ఆమె ప్ర‌య‌త్నించ‌గా...ఆశ్ర‌మ నిర్వాహ‌కులు ఏ మాత్రం అవ‌కాశం క‌ల్పించ‌లేదు. అయితే, ఆశ్ర‌మంలో సంగీత‌ తీవ్ర ఇబ్బందులు ప‌డుతుండ‌టం గ‌మ‌నించి ఆమెను త‌ల్లిదండ్రులు ఇంటికి తీసుకువ‌చ్చారు. అయితే, కొద్దికాలానికి ఆశ్ర‌మానికి చెందిన వారు వ‌చ్చి బ‌ల‌వంతంగా ఆమెను తిరిగి తీసుకువెళ్లారు. త‌న బిడ్డ‌ను ఇంటి వ‌ద్దే ఉంచాల‌ని కోర‌గా..పోలీసు కేసు పెడ‌తామ‌ని బెదిరించార‌ని ఝాన్సీరాణి వాపోయింది. అనంత‌రం ప‌లు ద‌ఫాలుగా ఆశ్ర‌మం వ‌ద్ద‌కు వెళ్లి క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ...వారు స్పందించ‌లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేసింది. డిసెంబర్28 - 2014న ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించింద‌ని పేర్కొంటూ త‌న శ‌వాన్ని అప్ప‌గించార‌ని వాపోయింది.

త‌న కూతురు చ‌నిపోయిన స‌మ‌యంలో కూడా త‌న‌ను క్షోభ‌కు గురిచేశార‌ని ఝాన్సీరాణి వాపోయింది. ఆశ్ర‌మంలోనే అంత్య‌క్రియ‌లు చేయాల‌ని ఒత్తిడి చేశార‌ని...తాను త‌మ స్వ‌గ్రామం తీసుకువెళ్తామ‌ని చెప్ప‌డంతో...పోస్టు మార్టం చేశార‌ని...అయితే త‌న బిడ్డ శ‌వాన్ని గ‌మ‌నించిన బంధువులు...రీపోస్ట్‌ మార్టం చేయ‌గా...శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాలు తొలి పోస్టు మార్టంలో తొల‌గించిన విష‌యాన్ని గ‌మ‌నించార‌ని తెలిపారు. దీంతో తాము పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని - క‌ర్ణాట‌క హైకోర్టులో కేసు వేశామ‌ని పేర్కొన్నారు. కేసు సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్లు వెల్ల‌డించార‌ని..అయితే సంబంధిత జ‌డ్జీ బ‌దిలీ అవ‌డంతో పురోగ‌తి లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో..త‌న‌కు న్యాయం జ‌రిగేలా సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని ఆమె వేడుకున్నారు. సంగీత చ‌నిపోయిన రెండేళ్ల‌కు త‌న భ‌ర్త కూడా బిడ్డ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మ‌ర‌ణించార‌ని త‌న జీవితం ఒంట‌రైపోయింద‌ని తెలిపారు. త‌మ వంటి దారుణ ప‌రిస్థితులు మ‌రెవ్వ‌రికీ ఎదుర‌వ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.