Begin typing your search above and press return to search.

హరిబాబు - గోకరాజు హస్తినలో మహా బిజీ !

By:  Tupaki Desk   |   9 March 2018 6:11 AM GMT
హరిబాబు - గోకరాజు హస్తినలో మహా బిజీ !
X
కేంద్ర మంత్రివర్గంలో 2 బెర్తులు ఖాళీ అయిన నేపథ్యంలో అవి దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ ఎంపీలు నానా పాట్లు పడుతున్నారు. హస్తినలో పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఆ స్థానంలోకి తమను తీసుకోవాల్సిందిగా విడివిడిగా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలపడాలంటే గనుక వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి సొంతంగా కూడా పోటీ చేసే స్థాయికి బలోపేతం చేయాలనుకుంటే కనుక తమకు మంత్రి పదవులు ఇస్తే చాలా లాభం జరుగుతుందని వారు చాటుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను ఆంధ్రప్రదేశ్కు చెందిన కాషాయ దళం ఎంపీల తోనే భర్తీ చేస్తే ప్రాధాన్యాల పరంగా రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూడటం లేదని ప్రజలకు సర్ది చెప్పుకోవచ్చునని వారు వాదిస్తున్నారు. మంత్రి పదవులు ఉంటే తాము విస్తృతంగా ప్రజల్లో తిరిగి కార్యక్రమాలు నిర్వహించి పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడే లాగా పని చేయగలం అని వారు అధిష్టానానికి హామీ ఇస్తున్నారు.

ఈ ఇద్దరిలో కంభంపాటి హరిబాబు కు ఇటీవలి మోడీ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కవలసినది. పదవీ గ్యారెంటీగా ఇస్తున్నట్టుగా విపరీతంగా ముందస్తు ప్రచారం జరిగింది. ఆయన పాపం, ప్రమాణ స్వీకారోత్సవానికి కుటుంబ సభ్యులను మనవళ్లను కూడా వెంటబెట్టుకుని హస్తినా పురానికి వెళ్ళి పోయారు. తీరా మంత్రివర్గ విస్తరణలో భంగపాటు తప్పలేదు. అందుచేత ఇప్పుడు పదవి గ్యారెంటీ అని కంభంపాటి హరిబాబు ఆశల ఊసులలో మునిగి ఉన్నారు.

మరోవైపు ఆయనకు చంద్రబాబు అనుకూల వ్యక్తిగా ఉన్న ముద్రను , గోకరాజు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎటూ కంభంపాటి హరిబాబు చేతిలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఉన్నది గనుక , మంత్రి పదవి తనకు కావాలని గోకరాజు అడుగుతున్నారు. ఇద్దరు ఎంపీలకు రెండు పదవులు ఉంటే రాష్ట్రమంతా ఇద్దరూ కష్టపడి తిరిగి పార్టీని బలోపేతం చేయగలం అని వారు అధిష్టానానికి నివేదించుకుంటున్నారు.

అయితే ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని మరింతగా అన్యాయం చేసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఛీకొడతారన్నది మాత్రం గ్యారంటీ. వీళ్లకు మంత్రి పదవులు ఇచ్చినా కూడా పార్టీ నిలదొక్కుకునే ది మాత్రం ఉండదని అధిష్టానం భావిస్తే గనుక ఏ ఒక్కరికీ పదవి దక్కదని రాజకీయవర్గాల్లో అనుకుంటున్నారు . అదే కనుక నిజమైతే ఏపీలో ఖాళీ అయిన రెండు పదవులు కూడా భాజపా ఉత్తరాదివారి కట్టబెడుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.