Begin typing your search above and press return to search.

ఎవ‌రీ గోకుల్‌? నీర‌వ్‌ కు చేసిన సాయ‌మేంది?

By:  Tupaki Desk   |   19 Feb 2018 8:41 AM GMT
ఎవ‌రీ గోకుల్‌?  నీర‌వ్‌ కు చేసిన సాయ‌మేంది?
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభ‌కోణంలో రోజులు గ‌డుస్తున్న కొద్దీ దిమ్మ తిరిగే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఏకంగా రూ.16వేల కోట్ల రూపాయిల కుంభ‌కోణం అంటే ఎవ‌రూ న‌మ్మ‌ని ప‌రిస్థితి. కానీ.. చేయాల‌నుకుంటే ఒక బ్యాంక్ బ్రాంచ్ ద్వారా ఎంత చేయొచ్చ‌న్న విష‌యాన్ని నీర‌వ్ చేసి చూపించేశాడు. మ‌రి.. అత‌నికి అన్ని విధాలుగా సాయం చేసిందెవ‌రు? నీర‌వ్ దోపిడీ వెనుక స‌హ‌కారం ఎవ‌రిది? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. అప్పుడు తెర‌పైకి వ‌స్తాడు గోకుల్ నాథ్ శెట్టి.

ఇంత‌కీ ఇత‌గాడు ఎవ‌రు? ఏం చేసేవాడు? అన్న‌ది చూస్తే.. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజ‌ర్ మాత్రమే. ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు బ్యాంకుకు ఎంత‌మేర బొక్క పెట్టాలో అంత మేర బొక్క పెట్ట‌ట‌మే కాదు దేశానికి తీర‌ని న‌ష్టాన్ని క‌లిగించ‌టంలో కీల‌క‌భూమిక పోషించాడు. త‌న రిటైర్మెంట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. నీర‌వ్ మోడీకి సాయం చేసే జోరును మ‌రింత‌గా పెంచేశాడు.

2017లో కేవ‌ల 63 రోజుల్లో ఏకంగా 143 లెట‌ర్స్ ఆఫ్ అండ‌ర్ టేకింగ్ లు జారీ చేసిన‌ట్లుగా గుర్తించారు. అంటే.. స‌రాస‌రిన రోజుకు రెండు అంత‌కంటే ఎక్కువ ఎల్ ఓయూల‌ను జారీ చేశార‌న్న‌మాట‌. 2011 నుంచి 2017 వ‌ర‌కూ ఇలా లెట‌ర్స్ జారీ చేసిన గోకుల్‌.. మొద‌ట్లో అత‌గాడి దోపిడీ జాగ్ర‌త్త‌గానే ఉండేది. ఆరేళ్ల వ్య‌వ‌ధిలో 150 ఎల్ ఓయూలు జారీ చేస్తే.. త‌న రిటైర్మెంట్ కు ముందు.. కేవ‌లం 63 రోజుల వ్య‌వ‌ధిలో ఏకంగా 143 ఎల్ ఓయూలు ఇవ్వ‌టం చూస్తే.. ఎంత వేగంగా స్విఫ్ట్ సిస్ట‌మ్ ద్వారా ఎల్ ఓయూల‌ను విదేశాల్లోని భార‌తీయ బ్యాంకుల‌కు చేర‌వేశారో అర్థ‌మ‌వుతుంది.

రికార్డు స్థాయిలో 2017 మార్చి 21న ఒక్క రోజులో గీతాంజ‌లి.. గిల్ ఇండియా.. న‌క్ష‌త్ర బ్రాండ్ డైమండ్స్ కు అనుకూలంగా బెల్జియంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంట్ వెర్ఫ్ బ్రాంచ్ కు 10 ఎల్ ఓయూల‌ను గోకుల్ జారీ చేశారు. మొద‌టి ఆరేళ్ల‌లో గోకుల్ అక్ర‌మంగా జారీ చేసిన ఎల్ ఓయూల విలువ రూ.6500 కోట్లు కాగా.. చివ‌రి 63 రోజుల్లో జారీ చేసిన 143 ఎల్ ఓయూల విలువ రూ.3వేల కోట్లు కావ‌టం గ‌మ‌నార్హం.

ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు నీర‌వ్ కు పూర్తిగా సాయం చేసిన గోకుల్‌.. రిటైర్ అయ్యాక కూడా వాడుకునేందుకు వీలుగా లాగిన్.. కోడ్ ను కూడా ఇచ్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. మామూలుగా అయితే ఎల్ ఓయూల గ‌డువు 90 రోజులే. కానీ నీర‌వ్ పాత క‌స్ట‌మ‌ర్ కావ‌టంతో వంద‌శాతం ఇవ్వాల్సిన మార్జిన్ మ‌నీని 365 రోజుల్లో చెల్లించేలా అవ‌కాశం ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

ఏదైనా ఎల్ ఓయూ బ్యాంకు జారీ చేసే ముందు.. తాము జారీ చేసే మొత్తానికి సంబంధించిన మొత్తాన్ని క‌చ్ఛితంగా బ్యాంకులో జ‌మ చేయాలి. రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్ అయితే.. ఈ గడువు 90 రోజులు ఉంటుంది. దీన్ని త‌న‌కు త‌గిన‌ట్లుగా వాడేసుకున్న గోకుల్‌.. నీర‌వ్‌ కు ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకు వీలుగా ఆ గ‌డువును 365 రోజుల‌కు పెంచేయ‌టం చూస్తే.. బ‌రితెగింపు ఎంత భారీగా జ‌రిగిందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.