Begin typing your search above and press return to search.

మేయరమ్మ జోరు చూస్తూంటే...?

By:  Tupaki Desk   |   30 March 2022 3:30 AM GMT
మేయరమ్మ జోరు చూస్తూంటే...?
X
విశాఖ నగర మేయర్ గా ఆమె పేరు ప్రకటించగానే అంతా ఎవరామే అనుకున్నారు. నిజానికి విశాఖ మేయర్ సీటుని నగర వైసీపీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి ఎపుడో రిజర్వ్ చేశారు. కానీ మహిళలకు యాభై శాతం పదవులు అన్న కాన్సెప్ట్ తెచ్చాక విశాఖ మేయర్ కూడా ఆటోమేటిక్ గా మహిళా పక్షం అయిపోయింది. దాంతో పార్టీలో ఒక నాయకుడిగా ఉన్న గొలగాని శ్రీనివాస్ భార్య హరి వెంకట కుమారికి  కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చి ఆమెను మేయర్ ని చేశారు.

అయితే ఆమె పూర్వాశ్రమంలో ఉపాధ్యాయురాలిగా చేశారు. ఇక మేయర్ గా కుర్చీ ఎక్కాక ఆమె  మొదట్లో తడబడినా తొందరలోనే అంతా అవగాహన చేసుకున్నారు. ఏడాది పాలన ముగిసేసరికి ఆమె జోరు పెంచారు. తన అధికారాలను తెలుసుకుని సక్రనంగా వాటిని ఉపయోగిస్తున్నారు. ఇక అభివృద్ధి  కార్యక్రమాలకు కూదా పెద్ద పీట వేస్తున్నారు.

అదే టైంలో ఆమె ఒక మాట అంటున్నారు. తాను మేయర్ గా ఉండగా విశాఖ చరిత్రలో గుర్తుండిపోయే భారీ ప్రాజెక్ట్ ని తెస్తాను అని. నిజంగా ఆమె అలా టార్గెట్ సెట్ చేసుకోవడం అంటే అది విశాఖకే కాదు, ఆమె పొలిటికల్ కెరీర్ కి కూడా మేలు చేసేదే అంటున్నారు.  ఇక మేయర్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె విశాఖలోని అన్ని రాజకీయ పార్టీలను కలిపి ఇటీవల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఎపుడూ ఉప్పూ నిప్పులా ఉండే వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ సందర్భంగా కలుసుకోవడం రాజకీయలకు అతీతంగా మాట్లాడుకోవడం ముచ్చట గొలిపే వ్యవహారం అయింది. ఆ విధంగా అందరూ మేయర్ రాజనీతిని మెచ్చుకున్నారు. ఇక ఆమె జీవీఎంసీకి పెద్ద ఎత్తున  బకాయిలు కోట్లలో పేరుకుపోయిన భారీ పరిశ్రమలు, కార్పోరేట్ సంస్థల వద్దకు స్వయంగా వెళ్లి వాటిని చెల్లించాలని కోరడం విశేషం.

పోర్టు చైర్మన్ని స్వయంగా కలసి జీవీఎంసీ బకాయిలు తీర్చండని ఆమె కోరడంతో పోర్టు యాజమాన్యం సైతం సానుకూలంగా స్పందించింది. అలా జీవీఎంసీ ఆదాయ మార్గాలను పెంచుతూనే కేంద్ర పధకాల కోసం ప్రయత్నం చేయడం, రాష్ట్ర ప్రభుత్వ నిధుల కోసం వత్తిడి చేయడం ద్వారా మేయర్ తన దక్షతను నిరూపించుకుంటున్నారు.

అదే టైంలో ఆమె తెల్లారిలేస్తే వార్డుల్లో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యల మీద కూడా దృష్టి పెడుతున్నారు. రాజకీయంగా అన్ని పార్టీలతో కలివిడిగా ఉంటూ అజాత శతృవు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అన్న చర్చ అయితే ఉంది.

ఆమెది తూర్పు నియోజకవర్గం. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమె అక్కడ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే వైసీపీ తరఫున ఇప్పటికే వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల పాగా వేశారు. ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. కానీ ఈసారి టికెట్ తనకే అంటున్నారు. కానీ ఆమె అగ్ర కులానికి చెందినవారు. భర్త బీసీ కావడం వల్లనే ఆమె బీసీ కార్డుతో రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఆమెను కనుక పక్కన పెడితే మేయరమ్మకు టికెట్ ఖాయమనే అంటున్నారు. ఇక ఇదే సీటు కోసం వైసీపీలో మరి కొందరు ప్రయత్నం చేస్తున్న వేళ మేయర్ జోరు చూసి వారు షాక్ తింటున్నారు. మరి అనూహ్యంగా మేయర్ అయిన హరి వెంకటకుమారి ఎమ్మెల్యేగా కూడా అవుతారా. ఏమో చూడాలి.