Begin typing your search above and press return to search.

బంగారం వేగానికి బ్రేకులు వేసిన రష్యా

By:  Tupaki Desk   |   13 Aug 2020 6:15 AM GMT
బంగారం వేగానికి బ్రేకులు వేసిన రష్యా
X
గడిచిన కొద్ది రోజులుగా దేశీయంగా బంగారం.. వెండి ధరలు పెరిగిపోతున్న తీరు చూసిన సామాన్యులే కాదు.. మధ్యతరగతి.. ఎగువమధ్యతరగతి వారు సైతం కలవరపాటుకు గురయ్యే పరిస్థితి. ఎంత కరోనా అయితే.. మాత్రం ఇంత భారీగా పెరిగిపోవటమా? అన్న సందేహం వారికి తలెత్తింది. రికార్డు స్థాయికి పెరిగిన బంగారం.. వెండి ధరలకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. మూడు రోజుల క్రితం బంగారం పది గ్రాములు రూ.57వేల మార్కును దాటితే.. వెండి కేజీ ఏకంగా రూ.77,840ను టచ్ చేసి సంచలనంగా మారింది.

ఇంతలా ధరలు పెరిగితే.. రానున్న రోజుల్లో బంగారం కొనే పరిస్థితి ఉందా? అన్న డౌట్లు చాలామందికి కలిగాయి. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో గడిచిన మూడు రోజుల్లో చాలానే మార్పు వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు రష్యా వ్యాక్సిన్ తయారు చేసిందన్న వార్త.. మార్కెట్ సెంటిమెంట్ లో మార్పు వచ్చేలా చేసింది. మంగళవారం నాటికి బంగారంధరతో పాటు వెండి ధర కూడా బాగా తగ్గిపోయింది.

కేవలం మూడు రోజుల వ్యవధిలో బంగారం పది గ్రాములకు రూ.4వేల వరకు తగ్గితే.. వెండి అయితే ఏకంగా రూ.10వేలకు పైనే ధర తగ్గిపోయింది. రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధర మంగళవారం ముగింపు నాటికి రూ.67,584కు పడిపోయింది. బంగారం.. వెండి ధరల దూకుడుకు బ్రేకులు వేసిందెవరు? ఏ కారణంతో అంత భారీగా ధరలు తగ్గుతున్నాయి? అన్న సందేహానికి ఆసక్తికర సమాధానం లభిస్తోంది.

కోవిడ్ కేసులు.. మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పలు దేశాల కరెన్సీ తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ఇదే సమయంలో తాము కోవిడ్ కు వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో.. దూకుడుకు బ్రేకులు పడ్డాయి. రష్యా వ్యాక్సిన్ విషయంలో మరింత స్పష్టత వచ్చి.. దాని ఫలితాలు సానుకూలంగా ఉంటే.. బంగారం.. వెండి ధరలు మరింత కిందుకు దిగి రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.