Begin typing your search above and press return to search.

ఓటుకు తులం బంగారం.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   19 Jan 2020 4:46 AM GMT
ఓటుకు తులం బంగారం.. ఎక్కడంటే?
X
తెలంగాణలో సాగుతున్న పుర ఎన్నికల్లో కొత్త సిత్రం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల సంగతి ఎలా ఉన్నప్పటికి హైదరాబాద్ శివారులోని మున్సిపల్.. కార్పొరేషన్ లకు జరుగుతున్న ఎన్నికల ఖర్చు కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తుందని చెబుతున్నారు. వెయ్యి ఓట్లు కనిష్ఠంగా.. గరిష్ఠంగా నాలుగు వేల ఓట్లు ఉన్నా మున్సిపల్.. కార్పొరేషన్లలో ప్రతి ఓటు చాలా కీలకంగా మారింది. దీంతో.. ఓటును సొంతం చేసుకోవటం కోసం భారీ ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

పేరుకు వార్డు మెంబరు.. కార్పొరేటర్ పదవి కోసం కోట్లాది రూపాయిలు వెదజల్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పలువురు గెలుపు కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. కొన్ని వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థులు తమకున్న ఆస్తుల్ని అమ్మి మరీ తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థుల కంటే మిన్నగా ఉండేందుకు ఒక్కో ఓటుకు రికార్డు స్థాయిలో రూ.30వేల వరకూ ఇచ్చేందుకు సిద్ధమవుతుంటే.. ఒకరిద్దరు ఓటుకు తులం బంగారం ఇచ్చేందుకు సైతం ముందుకు రావటం సంచలనంగా మారుతోంది. ఇలా ఒకరిపై ఒకరు ఎత్తులు..పైఎత్తులు వేసుకోవటం ద్వారా ఎన్నికల ఖర్చును మరోస్థాయికి తీసుకెళుతున్నట్లుగా చెప్పక తప్పదు.

కార్పొరేటర్లు.. వార్డు మెంబర్లుగా పోటీలో ఉన్నప్పటికీ.. మేయర్.. ఛైర్మన్ పదవులపై కన్నేసిన అభ్యర్థులు తమ గెలుపుతో పాటు.. తమ వారిని గెలిపించుకోవటం కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నగర శివారులో ఒక కార్పొరేషన్ లో తన భార్యను బరిలోకి దింపిన ఒక వ్యాపారవేత్త మేయర్ పదవి కోసం స్థానిక నేతలకు పార్టీ ఫండ్ గా రూ.20 కోట్లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.