Begin typing your search above and press return to search.

బంగారం తనఖా పెడితే అది పంట రుణం కాదు

By:  Tupaki Desk   |   10 Aug 2019 5:55 PM GMT
బంగారం తనఖా పెడితే అది పంట రుణం కాదు
X
రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసమంటూ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వడ్డీ రాయితీ ఇవ్వబోమని కేంద్రం ప్రకటించింది. వచ్చే అక్టోబరు నుంచి ఇలాంటి రుణాలు వ్యవసాయ రుణాల కేటగిరీలోకి రావని తేల్చిచెప్పింది. సాధారణ ప్రజలు బంగారంపై రుణం పొందితే బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తాయో... రైతులు బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణాలకూ అంతే వడ్డీ వర్తింపజేయాలని దేశంలోని అన్ని బ్యాంకులు, వ్యవసాయ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. సాధారణ ప్రజలు బంగారాన్ని తాకట్టు పెడితే బ్యాంకులు 9 శాతం నుంచి 10.5 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అక్టోబర్ 1 నుంచి రైతులకూ ఇంతే వడ్డీ వర్తించబోతోంది.

సాధారణంగా బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలు ఇస్తాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఒక్కో పంటకు ఎకరాకు ఎంత రుణం ఇవ్వొచ్చో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించి చెప్పే మొత్తం. ఇది ప్రతి ఏటా మారిపోతుంది. ఏటా ఈ సమితి సమావేశమై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయిస్తుంది. బ్యాంకులు ఆ ప్రకారమే రుణాలు మంజూరు చేస్తాయి. కేంద్రం కొత్త ఆదేశాలు వచ్చిన తరువాత కూడా ఈ విధానంలో వ్యవసాయ రుణాలు తీసుకోవచ్చు.. అయితే, బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణాలను మాత్రం పంట రుణాలుగా పరిగణించరు.

అయితే.. వ్యవసాయ రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ లభించాలంటే కిసాన్ క్రెడిట్ కార్డుతో రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కిసాన్ క్రెడిట్ కార్డుపై తీసుకునే రుణాలకు మాత్రమే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. దీనికి ఆధార్ తప్పనిసరి. ఏప్రిల్ 1 తరువాత ఇప్పటికే పంట రుణాలు తీసుకున్నవారు కూడా ఈ రాయితీని పొందొచ్చు. సంబంధిత పత్రాలు బ్యాంకులకు అందజేసి ఈ రాయితీ పొందొచ్చు. అయితే, కేంద్రం ఇక్కడ ఇంకో మెలిక పెట్టింది. రుణం పొందిన ఏడాదిలోనే దాన్ని తీరిస్తేనే రాయితీ వర్తిస్తుంది. లేదంటే వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

వ్యవసాయ రుణాలకు బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. కానీ, రైతులు తీసుకునే ఈ రుణాలపై కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీని చెల్లిస్తుంది. అంటే.. 4 శాతం వడ్డీని రైతు చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆ 4 శాతం కూడా భరిస్తామనడంతో రైతుపై భారం పడదు. మిగతా కొన్ని రాష్ట్రాలు కేంద్రంతో సమానంగా 3 శాతం భరిస్తుండడంతో అక్కడి రైతులు 1 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అయితే.. ఇదంతా గడువులోగా చెల్లించినప్పుడే. గడువు దాటిందో... మొత్తం 7 శాతం వడ్డీ రైతే చెల్లించాల్సి ఉంటుంది. రైతులు పంట రుణంగా లక్ష రూపాయల వరకు తీసుకుంటే గత ఏడాది వరకు వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఆ తర్వాత రుణ పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు. రైతులు పంట రుణం తీసుకున్న తర్వాత తిరిగి బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణంగా తీసుకొని దానిపై కూడా వడ్డీ రాయితీ పొందుతుండడంతో దాన్ని నివారించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో 18 శాతం వ్యవసాయ రుణాలు ఉండాలన్న రూల్ ఉండడతో బంగారం రుణాలనూ వ్యవసాయ రుణాల్లో చూపిస్తున్నారు. వాటిని అడ్డుకుంటే వాస్తవంగా వ్యవసాయ రుణాల శాతమెంతో తెలుస్తుందనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనా ఉంది.

....అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పెట్టుబడి కోసం డబ్బు చేతిలో లేని రైతులకు కష్టాలు తెస్తుంది. ఈ అవకాశం లేని కాలంలో రైతులు ప్రయివేటు వ్యాపారుల వద్ద బంగారం తనఖా పెట్టి కూడా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టేవారు. అయితే, బ్యాంకులు వ్యవసాయ రుణాలుగా బంగారు రుణాలివ్వడం ప్రారంభించాక రైతులకు ఉపశమనం కలిగింది. పైగా 4 శాతం వడ్డీకే ఈ రుణాలు దొరికేవి. కానీ... ఈ రుణాలను రైతుల కంటే ఇతరులు ఎక్కువగా వాడుకోవడం మొదలవడంతో కేంద్రం ఇప్పడు ఆంక్షలు విధించింది. రిజర్వు బ్యాంకు సూచన మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఆదేశాలు వచ్చిన రోజునుంచే బ్యాంకులు ఈ తరహా రుణాలను ఆపేశాయి. పంటల సీజన్ కావడంతో తాజా నిర్ణయం నిజంగా అవసరం ఉన్న రైతులను ఇబ్బందులపాల్జేస్తోంది.