Begin typing your search above and press return to search.

అక్కడ రూ.వెయ్యి నోట్లకు బంగారం ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   9 Nov 2016 3:40 PM GMT
అక్కడ రూ.వెయ్యి నోట్లకు బంగారం ఇస్తున్నారు
X
ఎంత ఎటకారం కాకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.500.. రూ.వెయ్యి నోట్లు తీసుకొని బంగారం ఇస్తారా? అన్న డౌట్ అక్కర్లేదు. కానీ.. ఇది నిజంగా నిజమని చెప్పక తప్పుదు. హైదరాబాద్ లోని పలు బంగారు దుకాణాలతో పాటు.. చాలా ముఖ్యపట్టణాల్లో ఇలాంటి వ్యవహారమే మా జోరుగా సాగుతోంది. ఓపక్క పెద్ద నోట్లు చెల్లవని చెబుతుంటే.. బంగారు వ్యాపారులు ఈ పెద్ద నోట్లను తీసుకొని ఏం చేస్తారన్న సందేహం రావొచ్చు. కానీ.. అక్కడే ఉంది అసలు విషయంతా.

లాభం లేకుండా ఏ పనిని చేయని వ్యాపారస్తుడు.. అందులోకి బంగారు వ్యాపారస్తుడు.. దేశ ప్రధాని చెల్లుబాటు ఉండవని చెప్పిన పెద్ద నోట్లను ఎందుకు తీసుకుంటున్నారన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికరమైన ముచ్చట్లు బయటకు వచ్చాయి. అదేమంటే.. పెద్ద నోట్లను తీసుకొని పది గ్రాముల బంగారం రూ.40వేల చొప్పున అమ్మకాలు మొదలెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షలాది రూపాయిల్ని బ్యాంకులకు తీసుకెళ్లి.. వాటికి లెక్కలు చెప్పే కన్నా గుట్టుగా బంగారం తీసుకోవటమే ఉత్తమంగా భావించిన పలువురు బంగారాన్ని తీసుకోవటానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారట.

మరి.. ఇంతా చేస్తే బంగారు వ్యాపారులకు లాభం ఏమిటన్న లెక్కలోకి వెళితే.. అక్కడు ఉంది అతి పెద్ద లెక్క. ఇవాల్టి మార్కెట్ ప్రకారం చూసినా.. బంగారం పది గ్రాముల ధర రూ.32 వేలను దాట లేదు. పది గ్రాములు రూ.40వేల చొప్పున అమ్మితే.. ఏకంగా రూ.8వేలకు పైనే లాభం. ఇక.. కస్టమర్లు ఇచ్చే పెద్ద నోట్లు చెల్లుబాటు కాకుండా ఏమీ ఉండవు. కాకుంటే ప్రస్తుతానికి బయట చెల్లవు కానీ.. బ్యాంకులు చక్కగా తీసుకుంటాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగా వచ్చిన నోట్లుగా లెక్క చెప్పేస్తే సదరు బంగారు షాపుల యజమానులకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు.

ఒకవేళ.. పన్నుకట్టాల్సి వచ్చినా.. ఆ పన్ను కట్టేస్తే సరి. ఎంత పన్ను కట్టినా.. ఆ మొత్తం ఏ వెయ్యో.. రెండు వేలో ఉంటుంది. ఏమైనా సర్దుబాటు ఉంటే అది కూడా ఉండదు. కానీ.. ప్రతి పది గ్రాములకు దాదాపు రూ.9 వేల వరకు అదనంగా తీసుకున్న వేళ.. పెద్ద నోట్లు తీసుకుంటే వచ్చేనష్టంఏమీ ఉండదు. అందుకే.. కొందరు బంగారు వ్యాపారస్తులు మహా తెలివిగా పెద్ద నోట్లకు బంగారాన్ని అమ్మేస్తున్నారు. ఎప్పుడేం అమ్మాలో వ్యాపారి కంటే బాగా మరెవరికి తెలుస్తుంది చెప్పండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/