Begin typing your search above and press return to search.

బంగారం వెలవెలబోయింది.. ఎందుకు?

By:  Tupaki Desk   |   27 Oct 2019 9:39 AM GMT
బంగారం వెలవెలబోయింది.. ఎందుకు?
X
ఉత్తరాధిన ధన్ తేరాస్.. దక్షిణాదిన ధన త్రయోదశి.. దీపావళి పండుగకు ముందు వచ్చే ఈ పండుగ నాడు మహిళలు అంతా బంగారం కొనడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో ఈ పండుగకు బంగారం కొనుగోళ్లు కోట్లలో జరుగుతాయని అంతా భావించారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

దీపావళికి దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు లేక షాపులన్నీ వెలవెలబోయాయి. గత దీపావళి సీజన్ లో 40 టన్నులు జరిగే బంగారం అమ్మకాలు ఈసారి కేవలం 20 టన్నులు మాత్రమే సాగాయని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. అసలు ఈ దీపావళికి బంగారం గిరాకీ లేదన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 25శాతం క్షీణించాయని ఆయన తెలిపారు.

అయితే దీనికి కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికమాంద్యంతోపాటు బంగారం ధర పెరగడం కూడా కారణమని తెలిపారు. మాద్యం దెబ్బకు ప్రజల వద్ద నగదు లభ్యత పడిపోయి మార్కెట్ లో బంగారానికి డిమాండ్ తగ్గిందన్నారు. ఇక భారత్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5శాతానికి పెంచడం కూడా బంగారం ధర చుక్కలనంటడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం బంగారం రేటు 10 గ్రాములకు 38,275 గా ఉంది. గత సంవత్సరం ఇదేరోజున బంగారం ధర రూ.31,702 రూపాయలుగా మాత్రమే ఉండడంతో ధరాభారం ప్రజలను బంగారం వైపు మొగ్గుచూపనీయలేదు.