Begin typing your search above and press return to search.

శ‌తాబ్దాల నాటి నిధి త‌మిళ‌నాడులో దొరికిందా?

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:25 AM GMT
శ‌తాబ్దాల నాటి నిధి త‌మిళ‌నాడులో దొరికిందా?
X
త‌మిళ‌నాడులో ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది మ‌దురై జిల్లా కీల‌డి కావేరి కూం ప‌ట్టినం ప్రాంతం. వంద‌ల ఏళ్ల క్రితం నాటి నిధి ఒక‌టి తాజాగా బ‌య‌ట‌ప‌డిన‌ట్లుగా భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం పురాత‌న కాలం నాటి నిర్మాణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో.. కేంద్ర పురావ‌స్తు శాఖ రంగంలోకి దిగింది. కీల‌డి ప్రాంతంలో రెండేళ్లుగా తీవ్ర‌స్థాయిలో చేస్తున్న ప‌రిశోధ‌న‌లు ఒక కొలిక్కి వ‌చ్చాయని.. తాజాగా భారీ ఎత్తున బంగారం గుట్ట‌లుగా దొరికిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

రాష్ట్ర సాంస్కృతి విభాగంతో క‌లిసి కేంద్ర పురావ‌స్తు శాఖ నిర్వ‌హించిన నాలుగో విడ‌త ప‌రిశోధ‌న‌లో పురాత‌న కాలానికి చెందిన ఎనిమిది వేల వ‌స్తువులు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు చెబుతున్నారు. ఇందులో అద్దాల‌తో రూపొందించిన వ‌స్తువులు మొద‌లు న‌వ‌ర‌త్నాల‌కు చెందిన వ‌స్తువులు కూడా ల‌భించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గుట్ట‌లు గుట్ట‌లుగా బంగారం బ‌య‌ట‌ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

రెండేళ్ల కాలంగా జ‌రుపుతున్న త‌వ్వ‌కాలు మొత్తంగా ప‌దిహేను ఎక‌రాల విస్తీర్ణంలో జ‌రుపుతున్నారు. కీల‌డికి చెందిన చంద్ర‌న్ అనే వ్య‌క్తి భూమిలోనూ.. తాజాగా కార్తీక్ అనే వ్య‌క్తికి చెందిన ఒక‌టిన్న‌ర ఎక‌రాల విస్తీర్ణంలోనూ ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ త‌వ్వ‌కాల్లో బావులు.. ఆ బావుల మ‌ధ్య ర‌హస్య‌మైన గ‌ది.. అందులో నుంచి గుహ‌లోకి వెళ్లే రీతిలో మార్గాలు ఉండ‌టం చూసిన పురావ‌స్తు వ‌ర్గాల్ని విస్మ‌యానికి గురి చేశాయి. ఈ గుహ‌ల్లో బంగారు నిధి ఉన్న‌ట్లుగా గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఒక గుహ‌లో కొంత బంగారు నిధి బ‌య‌ట‌ప‌డ‌గా.. దానిని మ‌రో ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా మ‌రో బంగారు నిధిని కూడా గుర్తించార‌ని.. అందుకే భూయ‌జ‌మానితో స‌హా ఎవ‌రినీ ఆ ప్రాంతంలోకి అనుమ‌తించ‌కుండా భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.