Begin typing your search above and press return to search.

అసలుసిసలు బంగారు బల్లి దర్శనమిచ్చింది

By:  Tupaki Desk   |   8 March 2016 4:55 AM GMT
అసలుసిసలు బంగారు బల్లి దర్శనమిచ్చింది
X
బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..? నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది.

చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని.. అవికూడా ఎక్కడో కాదు.. మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది.

బంగారు బల్లిగా చెప్పుకునే ఈ జీవి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్ గా చెబుతారు. రాత్రిళ్లు తిరిగి ఈ బల్లి బంగారు వర్ణంలో ఉంటుంది. 150 నుంచి 180 మిల్లీ మీటర్ల పొడవులో ఉండే ఈ బల్లులకు రాతి గుహలే నివాసయోగ్యాలుగా చెబుతారు. సూర్యరశ్శి అన్నది లేని చోట ఇవి జీవిస్తుంటాయి. రాత్రిళ్లు మాత్రమే ఇవి బయటకు వస్తాయి. జనాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటే పగటిపూట కూడా బయటకు వస్తుంటాయి.

సాధారణ బల్లుల కంటే గట్టిగా.. వింతగా అరిచే ఈ బంగారు బల్లులు 40 నుంచి 50 వరకు గుడ్లు పెడుతుంటాయి. శేషాచలంలోని శ్రీవారి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం తాజా బల్లి కనిపించింది. గతంలో తరచూ కనిపించే ఈ బల్లులు ఈ మధ్య కాలంలో కనిపించటం లేదు. అలాంటిది ఆదారం కనిపించటంతో పలువురు విస్మయానికి లోను కావటమే కాదు.. ఆనందానికి గురి అవుతున్నారు.