Begin typing your search above and press return to search.

‘వెలిగొండ’ టెండర్లలో అధికార ప‌క్ష నేత చేతివాటం!

By:  Tupaki Desk   |   25 May 2018 7:10 AM GMT
‘వెలిగొండ’ టెండర్లలో అధికార ప‌క్ష నేత చేతివాటం!
X
2014లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ అధికారం చేప‌ట్టింది మొద‌లు.....రాష్ట్రంలో అవినీతి తార‌స్థాయికి చేరింద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌ల్లీలో సీసీ రోడ్డు టెండ‌ర్ నుంచి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల టెండ‌ర్ల వ‌ర‌కు టీడీపీ నేత‌ల‌కు, వారి అనుయాయుల‌కు చంద్ర‌బాబు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టిన వైనాన్ని ప్ర‌తిప‌క్షం ప‌లుమార్లు ఎండ‌గ‌ట్టింది. అయినా, రాజే త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా అన్న‌ట్లు....సాక్ష్యాత్తూ సీఎం, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ అవినీతిని ప్రోత్స‌హిస్తుంటే.....మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేల‌కు అడ్డుచెప్పే నాథుడెవ‌డుంటారు. వెలిగొండ ట‌న్నెల్(సొరంగాల‌) ప్రాజెక్టు టెండ‌ర్ల‌ను ఎంపీ సీఎం ర‌మేష్ కు చెందిన కంపెనీకి గుంత‌గుప్ప‌గా అప్ప‌గించేందుకు వంద‌ల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని గ‌తంలో తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, మ‌రోసారి ఆ టెండ‌ర్ల‌ల‌లో లాబీయింగ్ జ‌రిగిన విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. సీఎం ర‌మేష్ సంస్థ‌ల‌క టెండ‌ర్లు అప్ప‌గించేందుకు దాదాపు 300 కోట్ల రూపాయ‌లు క‌మిష‌న్ ను కాజేసేందుకు టీడీపీకి చెందిన ఓ కీల‌క నేత టెండ‌ర్ల విష‌యంలో పావులు క‌దుపుతున్నార‌ని కొన్ని మీడియా వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

వాస్త‌వానికి వెలిగొండ ప్రాజెక్టును 2017 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దానిని వంక‌గా చూపించి 2016 జూలై 5న కాంట్రాక్టర్లకు ప్ర‌భుత్వం రూ.68.44 కోట్లు మంజూరు చేసింది. అయితే, ప‌నులు వేగ‌వంతంగా జ‌ర‌గ‌డం లేదంటూ 2 టన్నెళ్ల కాంట్రాక్టర్లపై వేటువేసింది. మొదటి టన్నెల్‌లో మిగిలిపోయిన 3.6 కిలోమీటర్ల పనుల విలువను రూ.116.44 కోట్లుగా.. రెండో టన్నెల్‌లో మిగిలిపోయిన 8.037 కిలోమీటర్ల పనుల విలువను రూ.299.48 కోట్లుగా స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్సీ) అంచ‌నా వేసింది. అస‌లు క‌థ ఇక్క‌డే మొద‌లైంది. టీడీపీలో చ‌క్రం తిప్పుతోన్న ఆ కీల‌క నేత ఆదేశాల ప్ర‌కారం మొద‌టి ట‌న్నెల్ ప‌నుల అంచ‌నా విలువ రూ.292.15 కోట్లు, రెండో టన్నెల్ పనుల అంచనా వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేశారు. ఈ నేప‌థ్యంలోనే మొదటి టన్నెల్‌ పనులకు ప్ర‌భుత్వం రూ.234.04 కోట్లు, రెండో టన్నెల్‌ పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చి 26న ప్ర‌భుత్వం టెండర్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ కీల‌క నేత తొలి టన్నెల్‌ పనులకు ఇద్దరు కాంట్రాక్టర్లు, రెండో టన్నెల్‌ పనులకు ఒకే కాంట్రాక్టర్ తో బిడ్‌లు దాఖలు చేయించారు.

అయితే, సింగిల్‌ బిడ్‌ టెండర్లను ఆమోదించకూడద‌నే నిబంధ‌న మీడియాలో హైలైట్ కావ‌డంతో దానిని తిర‌స్క‌రించారు. దీంతో, చేసేదేమీ లేక రెండో టన్నెల్‌కు 570.58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మే8న మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సారి ప‌క్కా వ్యూహంతో 3 సంస్థలతో టెండ‌ర్లు వేయించారు. సీఎం రమేష్ సంస్థకు పనులు దక్కేలా ఆ టెండ‌ర్లు వేశారు. బుధ‌వారం నాటి టెక్నికల్‌ బిడ్ లో ఈ లాబీయింగ్ వ్య‌వ‌హారం బ‌హిర్గ‌త‌మైంది. శనివారంనాడు ఫైనాన్స్‌ బిడ్‌ తెరిచి సీఎం రమేష్‌ సంస్థకు పనులు అప్ప‌గించేందుకు రంగం సిద్ద‌మైంద‌ని తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్య‌వ‌హారంలో 300 కోట్ల రూపాయలకుపైగా ముడుపులు చేతులు మారబోతున్నట్లు తెలుస్తోంది. వ‌డ్డించేవాడు మ‌న‌వాడైతే...అన్న త‌ర‌హాలో ప్ర‌భుత్వం అండ‌దండ‌లుంటే ఎన్ని వంద‌ల కోట్లు కాజేసినా అడిగేవాడెవ‌డు. అయితే, పిల్లి క‌ళ్లు మూసుకొని పాలు తాగుతూ ఎవ‌రూ చూడ‌లేద‌నుకున్న‌ట్లు....ఇంత అవినీతి భాగోతం మీడియాకు తెలియ‌కుండా ఉంటుంద‌నుకోవ‌డం అవివేక‌మే అవుతుంది. మ‌రి, ఈ లాబీయింగ్ వ్య‌వ‌హారంపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.