Begin typing your search above and press return to search.

ఆ పత్రికాధినేతను మళ్లీ టార్గెట్ చేసిన ‘గోనె’

By:  Tupaki Desk   |   19 July 2021 7:37 AM GMT
ఆ పత్రికాధినేతను మళ్లీ టార్గెట్ చేసిన ‘గోనె’
X
సీఎంగా ఏపీని ఏలిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన ప్రత్యర్థులైన రెండు పత్రికాధినేతలను టార్గెట్ చేశారన్న సంగతి మీడియా సర్కిల్స్ లో ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని నిండు అసెంబ్లీలో నాడు వైఎస్ఆర్ విమర్శించారు కూడా..

నాడు ఆ పత్రికాధినేతపై రాజమండ్రి నాటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లితో పలు కేసులు, ఫిర్యాదులు చేయించి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక మరో కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావును సైతం ఆ పత్రికాధినేతపై వైఎస్ఆర్ ఉసిగొల్పారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.

అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత అటు ఆయన ప్రోత్సహించిన ఇద్దరు నేతలు ఉండవల్లి, గోనె ప్రకాష్ రావులు రాజకీయంగా ఇన్ యాక్టివ్ గా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరమయ్యారు. మీడియాలోనూ కనిపించడం మానేశారు. ఉండవల్లి అడపదడపా అన్యాయాలపై స్పందిస్తున్నా గోనె మాత్రం బయటకు రాలేదు.

అయితే చాలా రోజుల తర్వాత గోనే ప్రకాష్ రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేకున్నా కూడా పోరాటం మొదలుపెట్టాడు. తాజాగా ఓ టీవీ చర్చలో పాల్గొన్నారు. సీరియస్ గా ఓ ప్రతిజ్ఞ కూడా చేశాడు. ‘అసైన్డ్ భూముల్లో ఓ ఫిల్మ్ సిటీ నిర్మించారని.. ప్రభుత్వ రహదారులు ఆక్రమించారని.. పేదల భూముల్లోకి వారిని అనుమతించకపోవడం దారుణం’ అని గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. వెంటనే స్వతంత్ర్య సంస్థతో దర్యాప్తు చేయించాలని గోనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

అంతేకాదు.. దీనిపై తాను వెనక్కి తగ్గనని.. సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తూ దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఈ అక్రమాలు అన్నింటిని నిరూపిస్తానని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిరూపించకపోతే తాను దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని సవాల్ చేశారు.

వైఎస్ఆర్ హయాంలో ఉండవల్లి, గోనె ప్రకాష్ రావులే ఆ పత్రికాధినేత ఆస్తులు, చిట్ ఫండ్ పై పెద్ద పోరాటం చేశారు. ఇన్నాళ్లు కామ్ గా ఉన్న ‘గోనె’ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ కావడం విశేషం. చూస్తుంటే ఆయన మళ్లీ ఏదో పార్టీలో చేరేలానే కనిపిస్తున్నాడన్న చర్చసాగుతోంది.