Begin typing your search above and press return to search.

టీడీపీ ఉంటేనే వైసీపీకి మేలు...ఇది నిజంగా నిజం

By:  Tupaki Desk   |   22 Nov 2022 1:30 AM GMT
టీడీపీ ఉంటేనే వైసీపీకి మేలు...ఇది నిజంగా నిజం
X
అదేంటి ఏపీలో టీడీపీ వైసీపీకి బద్ధ శతృవు కదా. ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అని పోరాడుతాయి కదా అని డౌట్ ఎవరికైనా రావచ్చు. కానీ రాజకీయాల్లో కొన్ని అలా ఉండడం అనివార్యం. బ్యాలన్స్ కూడా అపుడే సరిగ్గా కుదురుతుంది. ఏపీలో చూస్తే బలమైన రెండు ప్రాంతీయ పార్టీలుగా వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఇపుడు ఏపీలో జరుగుతోంది అచ్చమైన రాజకీయం కాదు, తుచ్చమైన రాజకీయ వికృత క్రీడ.

ఈ మాటను ఎందుకు వాడాల్సి వస్తోంది అంటే రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు. వారు ఎపుడూ ఉంటారు. కానీ శతృవులుగా ఎపుడైతే వారిని భావిస్తామో అపుడే వికృత రాజెకీయంగా అది మారుతుంది. అలా కనుక చూసుకుంటే దొందుకు దొందే అన్నట్లుగా అటు టీడీపీ ఇటు వైసీపీ రెండూ కూడా రాజకీయంగా మరో పార్టీని లేకుండా చేయాలనే చూస్తున్నాయి.

ఈ గేమ్ కి ని ఆద్యం పోసింది టీడీపీ అయితే దాన్ని మరింత కసిగా వైసీపీ కొనసాగిస్తోంది. టీడీపీ ఎలా వికృత క్రీడకు తెర తీసింది అంటే 2014 ఎన్నికల తరువత 67 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ బలమైన పార్టీగా విపక్షంలో అవతరించింది. నాటి నుంచి టీడీపీ పాలన సంగతి ఏమో కానీ వైసీపీని టార్గెట్ చేయడం మొదలెట్టింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలతో పాటు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ ఏపీ రాజకీయ తెరపైన లేకుండా చేయాలని చూసింది.

అంతే కాకుండా ఎక్కడికక్కడ వైసీపీని టీడీపీ ఆనాడు టార్గెట్ చేసింది. దాంతో ఇపుడు వైసీపీ వంతు వచ్చింది. తమ చేతిలో అధికారం ఉంది కాబట్టి మూడున్నరేళ్ళుగా టీడీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ దూకుడు చేస్తోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదులుకోకుండా టీడీపీని లేకుండా చేయాలని విశ్వప్రయత్నం చేస్తోంది

ఈ పరిస్థితుల్లో టీడీపీ కూడా తట్టుకుని నిలబడుతోంది కానీ వైసీపీ మాత్రం దూకుడు పెంచుకుంటూ పోతోంది. ఒక విధంగా టీడీపీని రాజకీయంగా ఎలిమినేట్ చేస్తే ఏపీని మూడు దశాబ్దాల పాటు తాను హ్యాపీగా ఏలుకోవచ్చు అని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అయితే అక్కడే వైసీపీ తప్పులో కాలేస్తోంది అని అంటున్నారు. టీడీపీ ఎలిమినేట్ అయితే ఆ రాజకీయ శూన్యత నుంచి మరో పార్టీ పుట్టుకువస్తుంది తప్ప వైసీపీకి దశాబ్దాల తరబడి అధికారం సొంతం కాదు అని అంటున్నారు.

ఇది చరిత్రలో నిజమైన రుజువైన సత్యం అని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పాగా వేయాలని బీజేపీ కాచుకుని కూర్చుంది. దానికి పిల్లీ పిల్లీ తగవు మాదిరిగా ఏపీలోని బలమైన ప్రాంతీయ పార్టీలు దెబ్బ తినడమే కావాలి. బీజేపీకి ఈ రోజు కావాల్సింది టీడీపీ ఎలిమినేషన్. ఆ తరువాత వంతు వైసీపీదే. దాంతో వైసీపీ టీడీపీని ఇబ్బందులు పెడుతూంటే బీజేపీకి మంచిదే. ఎందుకంటే ఆ పార్టీ ప్లేస్ లోకి రావాలన్నది బీజేపీ ఎత్తుగడ కాబట్టి.

కానీ అదే జరిగితే మాత్రం వైసీపీకి అసలైన చుక్కలు కనిపిస్తాయి అని అంటున్నారు. మరో ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీతో ఎన్నికల యుద్ధం రాజకీయాలు చేయడం వేరు పటిష్టమైన ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు దేశమంతా బలమున్న బీజేపీతో ఫైటింగ్ చేయడం వేరు. దీనికి అచ్చమైన ఉదాహరణ తెలంగాణా అని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ ని లేకుండా చేయాలని బీజేపీని ఎగదోసిన పాపానికి ఇపుడు టీయారెస్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది అని అంటున్నారు.

కేవలం ఒక ఎమ్మెల్యే 2018లో బీజేపీకి గెలిస్తే 2019 నాటికి నలుగురు ఎంపీలు అయ్యారు. ఈ రోజుకు ముగ్గురు ఎమ్మెల్యేలను చేసుకుంది. తెలంగాణా రాజకీయాల్లో తన వాటా కోసం బీజేపీ చేస్తున్న రాజకీయంతో అధికార టీయారెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అదే సీన్ రేపటి రోజున ఏపీలో కూడా రావచ్చు అని అంటున్నారు.

అందువల్ల టీడీపీ మీద దూకుడు చేసి అంతమొందించాలనుకుంటే అది బీజేపీ నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. అదే టీడీపీ ప్రత్యర్ధిగా ఉంటూ ఒక ఎన్నికలో గెలిచినా మరో ఎన్నికలో వైసీపీకి కూడా గెలిచే చాన్స్ ఉంటుంది. అలా కాకుండా బీజేపీ పరంగా ఏపీని చేస్తే మాత్రం ఇక కనుచూపు మేరలో ప్రాంతీయ పార్టీలకు అధికారం దక్కే సీన్ ఉండదని అంటున్నారు. సో వైసీపీ టీడీపీ విషయంలో శతృత్వం బదులు ప్రత్యర్ధిగా చూస్తూ రాజకీయం చేయడమే బెటర్ అన్నది రాజకీయ మేధావుల మాట.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.