Begin typing your search above and press return to search.

అమెరికా వలసదారులకు శుభవార్త‌… కీలక బిల్లులకు ఆమోదముద్ర !

By:  Tupaki Desk   |   20 March 2021 6:30 AM GMT
అమెరికా వలసదారులకు శుభవార్త‌… కీలక బిల్లులకు ఆమోదముద్ర !
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత అధ్యక్షుడు పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధ్యక్షుడు జో బిడెన్ ఆ హామీలను అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీయులకు మేలు చేసే పనిలో పడ్డారు. ట్రంప్‌ హయంలో తీసుకున్న పలు నిర్ణయాలకు మార్పులు చేస్తూ తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమ దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వాన్ని అందించే రెండు కీలక బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది.

అవసరమైన సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న వారికి, వారి పిల్లలకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం అందించనున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ కార్మికులు, హెచ్‌ 1బీ వీసా ద్వారా అమెరికాకు వచ్చిన టెక్‌ నిపుణుల పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని అందించేందుకు ఈ బిల్లులు ఉపయోగపడనున్నాయి. ఇక ఈ బిల్లులకు 228-197 ఓట్ల మెజార్టీతో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ.. దేశ వలస విధానంలో విప్లవాత్మక మార్పులను తెచ్చే దిశగా ఈ నిర్ణయం అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అక్రమవలసదారులపై జో బైడెన్ వరాలు కురిపించారు. ఎన్నికల్లో గెలిచి, అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తే 11 మిలియన్ల మంది అక్రమవలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తానని ప్రకటించారు. అయన అధ్యక్షుడిగా గెలవడం తో అన్నట్టుగానే ఆదిశగా ప్రయత్నాలు మొదలెట్టారు.

ఇదిలా ఉంటే ఈ చట్టం ద్వారా ఎక్కువగా లాభపడే వారిలో భారతీయులు ముందు వరుసలో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో సరైన సర్టిఫికేట్లు లేకుండా 1.1 కోట్ల మంది నివసిస్తుంటే వీరిలో 5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇక తాజా బిల్లు ఆమోదంతో 21 ఏండ్లు దాటిన హెచ్‌-1బీ వలసదారుల పిల్లలకు పౌరసత్వం లభించడానికి మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే ‘ది అమెరికన్ డ్రీమ్ అండ్ ప్రామిస్’ అనే పేరుతో ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులు చట్టరూపం దాల్చాలంటే సెనేట్‌ ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. అయితే సెనేట్ ‌లో డెమోక్రాట్లకు మెజారిటీ ఉన్నందున ఆమోదం పొందడం లాంచనమే అని చెప్పవచ్చు. ఈ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం ల‌భిస్తే.. అటుపై అధ్య‌క్షుడు జో బైడెన్ సంత‌కంతో చ‌ట్టంగా మార‌నున్న‌ది.