Begin typing your search above and press return to search.

ఏపీకి స్వీట్ న్యూస్.. ఒడిశాకు షాక్.. ఈ ఎపిసోడ్ చెప్పేదేమంటే?

By:  Tupaki Desk   |   22 Jun 2021 4:05 AM GMT
ఏపీకి స్వీట్ న్యూస్.. ఒడిశాకు షాక్.. ఈ ఎపిసోడ్ చెప్పేదేమంటే?
X
జేబులోని చివరి రూపాయిని ఇవ్వాలని బలవంతంగా చేస్తే.. సర్లే పాపం అన్నట్లుగా ఉంటుంది ఏపీ తీరు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి తీరునే ప్రదర్శించినప్పటికీ.. చరిత్రలో మాత్రం ఏపీకి తరచూ అన్యాయం జరుగుతూనే ఉంటోంది. పొరుగు రాష్ట్రం దాహార్తితో విలవిలలాడుతుంటే తెలుగుగంగ ప్రాజెక్టుతో తమిళనాడుకు నీటిని ఇచ్చిందే కానీ మొండి చేయి చూపించింది లేదు. ఏపీ సరిహద్దును పంచుకునే కర్ణాటక అల్మట్టి ప్రాజెక్టుతో తొండి చేసినా.. న్యాయం కోసం పోరాడిందే తప్పించి.. కయ్యాలు పెట్టుకున్నది లేదు.

విడిపోయి కలిసి ఉందామని తెలంగాణ ఉద్యమ వేళ చెప్పిన మాటను పక్కన పెడితే.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్.. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినప్పటికీ.. బతికి చెడిపోయామన్న బాధను ఆంధ్రోడు వ్యక్తం చేయలేదు. ఉన్నదాంతోనో సరిపెట్టుకుందామన్నట్లుగా వ్యవహరించారే తప్పించి.. గిల్లికజ్జాలు పెట్టుకున్నది లేదు.

ఏపీకి మరో సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాతో సంబంధాలు ఓకే అన్నట్లు ఉన్నప్పటికీ.. వంశధార నదీ జలాల విషయంలో ఆ రాష్ట్రం పేచీ పెట్టినా.. న్యాయంగా.. ధర్మంగా పోరాడిన ఏపీ ఎట్టకేలకు విజయాన్నిసాధించింది. ఇవ్వటమే కానీ తీసుకోవటం చేతకాని ఏపీ.. మరోసారి తాను నమ్మిన బాటలో నడిచి గెలుపొందింది. తాజాగా వంశధార ట్రైబ్యునల్ లో ఏపీకి అనుకూలంగా తీర్పు రావటమే కాదు.. ఆంధ్రప్రదేశ్ కోరినట్లుగా 106 ఎకరాల భూమిని సేకరించాల్సిన బాధ్యత ఒడిశా సర్కారుదేనని స్పష్టం చేసింది.

వంశధార నదీజలాలు.. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణపై దాఖలైన రెండు మధ్యంతర పిటిషన్లపై వంశధార ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రతిపాదించిన 106 ఎకరాల్లో ప్రాజెక్టు సాధ్యం కాదని ఒడిశా చేసిన వాదనను ట్రైబ్యునల్ కొట్టిపారేసింది. ప్రత్యేకంగా అప్పీల్ అథారిటీ అవసరం లేదని చెప్పటమే కాదు.. వంశధార నదీ జలాల్నిచెరిసగం వాడుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇంతకాలం ఒడిశా సర్కారు చేసిన పిడి వాదన తప్పని తేలింది. రానున్న రోజుల్లో ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కారు చేసిన వ్యాఖ్యలు నిజం కాదని.. న్యాయం ఏపీ వైపునే ఉందని ట్రైబ్యునళ్లు తేల్చే రోజు దగ్గర్లోనే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.