Begin typing your search above and press return to search.

ఏపీ విద్యార్ధులకి శుభవార్త ...ఇకపై 'అమ్మఒడి' లో ల్యాప్ టాప్స్ !

By:  Tupaki Desk   |   11 Jan 2021 10:21 AM GMT
ఏపీ విద్యార్ధులకి శుభవార్త ...ఇకపై అమ్మఒడి లో ల్యాప్ టాప్స్ !
X
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన సమయం నుండి పలు విప్లవాత్మకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మేలు కలిగేలా ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తుంది అన్న విషయం తెలిసిందే. పేద విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు చేయూత అందించే విధంగా అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయాన్నిజగన్ సర్కార్ అందిస్తుంది.

జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను సీఎం వైఎస్ జగన్ నెల్లూరులో ప్రారంభించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్ ‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా, ఆ తర్వాత ఇంటర్‌ వరకూ వర్తింపజేశారు. ఈసారి జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48,865 మంది లబ్ధిదారులకు రూ,13,023 కోట్లు జమ చేశారు. జగనన్న అమ్మఒడికి సంబంధించి 2వ విడత డబ్బుల్లో రూ. 15,000 కు గాను 14,000 అర్హుల ఖాతాలో, ఇంకో రూ. 1,000 డిటిఎంఎఫ్ కు జమ అవుతాయి. అమ్మఒడి పథకం విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఇక పేద ప్రజలందరికీ మరో శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్క, చెల్లెమ్మకు ప్రత్యామ్నాయం ఇస్తున్నామన్నారు జగన్. తొమ్మిదో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులు.. వచ్చే ఏడాది నుంచి అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు.. లేకపోతే డబ్బులు వద్దు.. ల్యాప్‌ టాప్ ‌లు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

రూ. 25వేల నుంచి రూ.27వేలు ఉంటుందని, సాధ్యమైనంత తక్కువ ధరకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ల్యాప్ ‌టాప్‌ లకు మూడేళ్లు వారంటీ, పాడైతే వారంలో రీప్లేస్ చేస్తామన్నారు. వసతి దీవెన అందుకుంటున్నవారికి కూడా ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. కోవిడ్ సమయంలో ఆన్‌ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు పేదింటి పిల్లలు ఇబ్బందిపడుతున్నారని.. ఈ పరిస్థితిని మార్చాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నామన్నారు.ఎనిమిదో తరగతి నుంచి కంప్యూటర్ కోర్సును కూడా ప్రవేశపెడతామన్నారు.. వచ్చే మూడేళ్లలో ప్రతి ఊరిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అంగన్ ‌వాడీలను మార్చి వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-1, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-2లుగా మారబోతున్నాయన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్.