Begin typing your search above and press return to search.

భార‌తీయ విద్యార్థుల‌కు ఆ దేశం శుభ‌వార్త‌!

By:  Tupaki Desk   |   11 Oct 2022 5:14 AM GMT
భార‌తీయ విద్యార్థుల‌కు ఆ దేశం శుభ‌వార్త‌!
X
త‌మ దేశంలో విద్య‌న‌భ్య‌సిస్తున్న భార‌తీయ విద్యార్థుల‌తోపాటు అంత‌ర్జాతీయ విద్యార్థుల‌కు కెన‌డా ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌ విద్యార్థులతోపాటు అంత‌ర్జాతీయ విద్యార్థులు కెన‌డా దేశంలో వారానికి 20 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేసుకునే వీలుండేది.

చాలామంది విద్యార్థులు త‌మ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి, ట్యూష‌న్ ఫీజులు క‌ట్టుకోవ‌డానికి, వ‌స‌తి, ఇత‌ర మెయిన్‌టెనెన్స్ ఖ‌ర్చుల కోసం ఇలా పార్ట్‌టైమ్ వ‌ర్క్ చేసుకుంటూ కెన‌డాలో చ‌దువుకుంటూ ఉండేవారు. ఈ క్ర‌మంలో త‌మ ఖ‌ర్చుల‌కు మ‌రింత న‌గ‌దును సంపాదించుకోవ‌డానికి కెన‌డా నిర్దేశించిన ప‌నిగంట‌ల‌ కంటే ఎక్కువ ప‌నిగంట‌లు అధికారుల‌కు తెలియ‌కుండా ప‌నిచేసేవారు. త‌ద్వారా త‌మ ఖ‌ర్చుల‌కు కావాల్సిన న‌గ‌దును కూడ‌బెట్టుకునేవారు.

అయితే ఇలా అధికారుల‌కు తెలియ‌కుండా నిర్దేశించిన ప‌రిమితికి మించి వారానికి 20 గంట‌ల కంటే ఎక్కువే ప‌నిచేస్తుండ‌టంతో వారిలో ఏదో ఒక మూల‌న భ‌యం ఉండేది. ఇలా వారానికి 20 గంట‌ల‌కంటే ఎక్కువ ప‌నిచేస్తూ అధికారుల‌కు దొరికిపోతే త‌మ‌పై ఆ దేశం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని.. అక్క‌డి నుంచి త‌మ‌ను త‌మ దేశాల‌కు పంపించేస్తుంద‌ని భ‌య‌ప‌డేవారు.

అయితే ఇక నుంచి ఇలా భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. ఈ మేర‌కు కెన‌డా ప్ర‌భుత్వం త‌మ దేశంలో చ‌దువుకునే భార‌తీయ విద్యార్థుల‌తోపాటు అంత‌ర్జాతీయ విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న 20 గంట‌ల ప‌రిమితిని ఎత్తేసింది. ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించే విద్యార్థులు క్యాంప‌స్ బ‌య‌ట ప‌నిచేసుకోవ‌డాన్ని మరింత సుల‌భ‌త‌రం చేసింది.

కెన‌డాలో చాలా మంది విద్యార్థులు పెట్రోల్ పంపులు, రెస్టారెంట్లు, కాఫీ షాప్‌లు మొదలైన వాటిలో పనిచేసుకుంటూ త‌మ చ‌దువుల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇంత‌క‌కుముందు వ‌ర‌కు ఉన్న వారానికి 20 గంట‌లు మాత్ర‌మే ప‌ని విధానంతో అక్రమంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయాలంటే భ‌య‌ప‌డేవారు.

ఇప్పుడు కెన‌డా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డంతో విద్యార్థుల‌కు ఎక్కువ గంటలు పని చేసే అవకాశం ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం రూపాయి.. డాల‌ర్‌తో పోల్చిన‌ప్పుడు చాలా దారుణంగా ప‌డిపోయింది. దీంతో కెన‌డా డాల‌ర్ కూడా భారీగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఆ దేశంలో చ‌దువుకుంటున్న భార‌తీయ విద్యార్థులు మ‌రింత ఎక్కువ‌గా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో ఆ దేశం అంత‌ర్జాతీయ విద్యార్థుల‌కు ఊర‌ట క‌ల్పించ‌డానికి పార్ట్‌టైమ్ ప‌ని విధానాన్ని సుల‌భ‌త‌రం చేసింది. దీని ద్వారా విద్యార్థులు పార్ట్ టైమ్ ప‌నిచేసుకుంటూ చ‌దువుకోవ‌చ్చు. అది కూడా ఎక్కువ ప‌నిగంట‌లు చేసుకోవ‌చ్చు. ఈ చ‌ర్య‌ కెనడాలో ఇప్పటికే ఉన్న 2,40,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కెన‌డా భావిస్తోంది.

మ‌రోవైపు ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద దేశ‌మైన కెన‌డా భారీ ఎత్తున వివిధ రంగాల్లో మాన‌వ వ‌న‌రుల‌ కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలో చ‌దువులు పూర్తిచేసుకుని త‌మ దేశంలో స్థిర‌ప‌డాల‌నుకునేవారికి కెన‌డా మంచి ప్రోత్స‌హ‌మందిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.