Begin typing your search above and press return to search.

వైద్య విద్యార్ధులకి గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన కన్వీనర్‌ కోటా ఫీజులు !

By:  Tupaki Desk   |   30 May 2020 7:50 AM GMT
వైద్య విద్యార్ధులకి గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన కన్వీనర్‌ కోటా ఫీజులు !
X
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. వైద్య విద్య అంటే పేదవారికి అందని ద్రాక్షలనే మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలన్నింట్లోనూ ఫీజులను తగ్గించింది.

2020–21 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్యార్థుల అడ్మిషన్లు దగ్గర పడిన నేపథ్యంలో ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వైద్య కళాశాలల్లో భారీగా ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజులు 2022- 2023 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర పలికే యాజమాన్య కోటా సీటు ఫీజు లక్షల్లోకి తగ్గిపోయింది. కన్వీనర్‌ కోటా సీట్లకు సైతం ఏడాదికి రూ.7.60 లక్షలున్న ఫీజు కూడా దాదాపు సగానికి పడిపోయింది.

కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారీ లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇకపై మైనారిటీ, నాన్- మైనారిటీ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలన్నింటికి కూడా ఒకే తరహ ఫీజులు ఉండనున్నాయి. అలాగే వైద్య కళాశాలలకు మరిన్ని రూల్స్ విధించింది. వార్షిక ఫీజును కాలేజీ యాజమాన్యాలు రెండు దఫాలుగా వసూలు చేయవచ్చు అని, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించింది. అలాగే , ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యార్ధులకు ఇస్తున్న స్టైఫండ్‌నే ప్రైవేటు కాలేజీలలో కూడా ఇవ్వాలి అని , ఫీజుల వసూళ్ళపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది అని తెలిపారు.

అయితే, ఈ ఏడాది పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ ఏపీ ఫీ రెగ్యులేటరీ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 12 మెడికల్, 13 డెంటల్ కాలేజీలలో మెడికల్, డెంటల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు నిలిపేస్తున్నట్లు ఏపీ మెడికల్ అండ్ డెంటల్ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే విద్యార్ధులకు ఇచ్చే స్టైఫండే ఎక్కువగా ఉందని తెలిపాయి. అలాగే, ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కళాశాలలన్నీ కూడా కరోనా ఆసుపత్రులుగా మారినట్లు తెలుపుతూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి యాజమాన్యం లేఖ రాసింది.