Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లోని భారత మెడిసిన్ విద్యార్థులకు ఊరట

By:  Tupaki Desk   |   5 March 2022 4:40 AM GMT
ఉక్రెయిన్ లోని భారత మెడిసిన్ విద్యార్థులకు ఊరట
X
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ ఎన్నో రంగాలు సంక్షోభంలో పడ్డాయి. రోజు రోజుకూ యుద్ధ తీవ్ర రూపం దాల్చుతుండడం వల్ల అక్కడ ఉన్న ఇతర దేశాలవారు అప్రమత్తమయ్యారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఇక్కడకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఆపరేషన్ గంగ పేరుతో అక్కడ చదువుతున్న విద్యార్థులు, ఇతర భారతీయుల్ని వేగంగా తరలించేందుకు కేంద్ర మంత్రులు సహా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. అయితే స్వదేశానికి వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. లక్షలు పోసిన చదువు... ఏం అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

మన దేశానికి చెందిన చాలా మంది ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్నారు. ఇక్కడితో పోల్చితే ఆ దేశం లో ఖర్చు చాలా తక్కువ. ఫలితంగా ఇక్కడ సీటు రానివారు, డాక్టర్ కావాలనే ఆశ గట్టిగా ఉన్నవాళ్లు అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధం నేపథ్యంలో అవన్నీ వదిలేసి ఇక్కడకు వచ్చారు. అయితే జాతీయ మెడికల్ కమిషన్, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ లైసెన్షియేట్ నిబంధనలు కొన్ని ఉంటాయి.

వాటి ప్రకారం ఎక్కడైతే మెడిసిన్ చదువుతారో... అక్కడ శిక్షణ, ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఆ దేశం లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సు మధ్యలో వచ్చి వేరే దేశంలో చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. ఈ క్రమంలో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

తమ కోర్సు ఏం అవుతుందోనని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు కేంద్రం ఊరట కలిగించే విషయం చెప్పింది. ఎంఎన్సీ నిబంధనలు సడలించడం లేదా భారత్, విదేశాల్లో వైద్య విద్య ను పూర్తి చేసేలా అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించింది. మధ్యలో ఆగిపోయిన కోర్సును వేరే దేశాల్లో కొనసాగించే దిశగా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. మన దేశంలో ఉన్న ప్రైవేటు కళాశాలలు, ఇతర దేశాల్లోని వివిధ యూనివర్శిటీలకు బదిలీ చేసే అవకాశం పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై జాతీయ ఆరోగ్య కమిషన్, కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనం చేస్తుంది. నీతి ఆయోగ్ కూడా దీనిపై చర్చించనుంది. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం కాకుండా... మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోనున్నారు. కోర్సు మధ్యలో ఆపేసిన విద్యార్థులకు ఊరటనిచ్చే అంశాన్ని త్వరలో వెలువరించే అవకాశం ఉంది.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ బలగాలు జోరుగా తలపడుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో బాంబుల మోత మోగుతోంది. యుద్ధం విరమించి చర్చలు జరుపుకోవాలని... పలు దేశాలు సూచించినా రష్యా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.