Begin typing your search above and press return to search.

ఎన్నారైల‌కు శుభ‌వార్త‌...మ‌ధ్య‌త‌ర‌గతి దుర్వార్త‌

By:  Tupaki Desk   |   5 July 2019 5:30 PM GMT
ఎన్నారైల‌కు శుభ‌వార్త‌...మ‌ధ్య‌త‌ర‌గతి దుర్వార్త‌
X
భారీ మెజార్టీతో రెండో ద‌ఫా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే స‌ర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు, సంస్కరణలు ప్రభుత్వానికి సవాల్‌ గా ఉండ‌గా...ప‌లు ఆకాంక్ష‌లు నెర‌వేరుస్తూ...ఎన్నో నిరాశ వార్త‌లు అందిస్తూ... మోదీ మొద‌టి బ‌డ్జెట్ సాగింది. ఇండియన్ పాస్‌ పోర్టు కలిగిఉన్న ఎన్‌ ఆర్‌ ఐలకు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆధార్‌ కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న 180 రోజుల నిరీక్షణకు ముగింపు పలికారు. ఆఫ్రికా దేశాల్లో 18 రాయబార కార్యాలయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. ఇప్పటికే 5 దేశాల్లో రాయ‌బార కార్యాలయాలు ప్రారంభించామ‌న్నారు. ఎన్నారైల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్ర‌మంత్రి సామాన్యుల‌కు మాత్రం దుర్వార్త వినిపించారు.

తాజాగా బ‌డ్జెట్లో మోదీ స‌ర్కారు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆదాయ‌ప‌న్నులో ప్ర‌భుత్వం ఎటువంటి మిన‌హాయింపు ప్ర‌క‌టించ‌లేదు. 5 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే సంప‌న్నులపై మాత్రం ప్ర‌భుత్వం అద‌న‌పు ప‌న్ను విధించింది. వ్య‌క్తిగ‌తంగా కోట్లు సంపాదిస్తున్న‌వారిపై స‌ర్‌ చార్జ్‌ ను అమ‌లు చేయ‌నుంది. 2 కోట్ల నుంచి 5 వ‌ర‌కు సంపాదించేవారిపై 3 శాతం స‌ర్‌ చార్జ్‌, ఇక 5 కోట్ల క‌న్నా ఎక్కువ సంపాదించేవారిపై 7 శాతం స‌ర్‌ చార్జ్ వ‌సూల్ చేయ‌నుంది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌ స‌భ‌లో తెలిపారు.

ఇక డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు చర్యలు తీసుకుంది ప్ర‌భుత్వం. డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణ‌యం వెలువ‌రించారు. బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ. కోటి నగదు ఉపసంహరణ పరిమితి విధించిన కేంద్రం ఉపసంహరణ పరిమితి రూ. కోటి దాటితే 2 శాతం టీడీఎస్ విధిస్తామ‌ని పేర్కొంది. సుమారు మూడు కోట్ల చిల్ల‌ర వ్యాపారుల‌కు పెన్ష‌న్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల తెలిపారు.వార్షిక ట‌ర్నోవ‌ర్ 1.5 కోట్ల క‌న్నా త‌క్కువ ఆదాయం ఉన్న రిటేల్ ట్రేడ‌ర్ల‌కు పెన్ష‌న్ బెనిఫిట్ క‌ల్పించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి క‌ర‌మ్ యోగి మాన్ ధాన్ స్కీమ్ కింద ఇది వ‌ర్తిస్తుంద‌న్నారు. జీఎస్టీ కింద రిజిస్ట‌ర్ చేసుకున్న‌ మ‌ధ్య‌శ్రేణి సంస్థ‌ల‌కు 2 శాతం వ‌డ్డీతో రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. దాని కోసం సుమారు 350 కోట్లు కేటాయించిన‌ట్లు ఆమె తెలిపారు. కిరాయి ఇంటి చ‌ట్టాల‌ను మార్చ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. సామాజిక కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌త్యేక స్కీమ్‌ను ఏర్పాటు చేశారు. నిధుల స‌మీక‌ర‌ణ కోసం సోష‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఏర్పాటు చేయ‌నున్నారు.