Begin typing your search above and press return to search.

టీడీపీ కి షాక్.. వైఎస్సార్సీపీ కి గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   3 Feb 2020 9:30 AM GMT
టీడీపీ కి షాక్.. వైఎస్సార్సీపీ కి గుడ్ న్యూస్
X
ఢిల్లీలో తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. 30 ఏళ్లుగా కొనసాగిన పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని తొలగించి తాజాగా వైఎస్సార్ సీపీకి కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీకి పార్లమెంట్ లో నూతన కార్యాలయాన్ని కేటాయించారు. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 22 మంది ఎంపీలను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పార్లమెంట్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నంబర్ గదిని వైఎస్సార్ సీపీకి కేటాయించారు. ఈ గదిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న టీడీపీ కార్యాలయాన్ని రద్దు చేస్తూ వైఎస్సార్సీపీకి కేటాయించారు. టీడీపీకి సరైన సంఖ్యలో సభ్యులు లేకపోవడంతో ఆ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీకి ఇచ్చారు.

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వారికి కేటాయిస్తున్నట్లు స్పీకర్‌ శనివారం ప్రకటించారు. మూడో అంతస్తులోని 118 నంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారు. మూడు నెలల కిందటే అయిదో నంబర్ గది కేటాయించినా ఖాళీ చేయలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ ద్వారా స్పీకర్‌ దృష్టి కి తీసుకెళ్లారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భం గా.. మరోసారి ఓం బిర్లాను కలవడంతో లేఖపై స్పందించారు. ఆయన ఆదేశాలతో పార్లమెంట్‌ సిబ్బంది.. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నంబర్ గదికి టీడీపీ బోర్డును తొలగించి వైఎస్సార్‌సీపీ కార్యాలయంగా మార్చారు. ఈ కార్యాలయానికి సమీపంలో ప్రధానమంత్రి మోదీ (పదో నంబర్ గది), హోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం కూడా ఉంది.