Begin typing your search above and press return to search.

జగన్ మరో తీపికబురు.. రూ.3 వేలు కాస్తా రూ.5వేలు ఎవరికంటే?

By:  Tupaki Desk   |   14 Jun 2022 3:20 AM GMT
జగన్ మరో తీపికబురు.. రూ.3 వేలు కాస్తా రూ.5వేలు ఎవరికంటే?
X
అప్పుల మీద అప్పులు తెస్తున్న వైనంపై విమర్శలతో విరుచుకుపడుతున్నా.. 'తగ్గేదెలే' అన్న చందంగా తాను నమ్మిన సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వరాన్ని అందజేశారు.

తన మూడేళ్ల పాలనలో పెంచుకుంటూ పోయిన సంక్షేమ పథకాల కారణంగా ప్రభుత్వం మీద భారీ ఎత్తున భారం పడుతోందని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సైతం అప్పులు చేయాల్సి వస్తోందన్న విమర్శల్ని పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్న జగన్ సర్కారు తాజాగా మరో వరాన్ని ప్రకటించింది.

ఇప్పటివరకు సిజేరియన్ జరిగితే రూ.3వేలు తల్లికి సాయం కింద ఇచ్చేవారు. అందుకు భిన్నంగా ఇకనుంచి ఏ తరహా ప్రసవాలైనా సరే వైఎస్సార్ ఆరోగ్య అసరా కింద తల్లులైన వారికి రూ.5వేలు చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. సహజ ప్రసవమైనా.. సిజేరియన్ అయినా తల్లీబిడ్దల సంరక్షణ ముఖ్యమని.. అందుకే అన్ని ప్రసవాలకు ఒకే మొత్తాన్ని ఇవ్వాలని చెప్పటమే కాదు.. రూ.5వేల చొప్పున ఇవ్వాలని డిసైడ్ చేశారు.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా నెలకు ఏపీ ప్రభుత్వం రూ.270 కోట్లను ఖర్చు చేస్తోంది. 104, 108 సర్వీసుల కోసం రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ సర్కారు.. వైఎస్సార్ ఆరోగ్య అసరా కింద నెలకు రూ.35 కోట్లను ఖర్చు చేస్తున్నారు.

ఆరోగ్య శ్రీ.. సంబంధిత కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి వచ్చింది మాత్రం రూ.223 కోట్లు కావటం గమనార్హం.

ఈ ఏడాది మాత్రం ఈ పథకంలో భాగంగా రూ.360 కోట్లు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఏమైనా.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. తాను నమ్ముకున్న పథకాలకు ఇచ్చే మొత్తాన్ని అంతకంతకూ పెంచేసుకుంటూ పోతున్న జగన్.. ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నారన్న సందేహం కలుగక మానదు.