Begin typing your search above and press return to search.

మంచిరోడ్లతోనే ప్రమాదాలు: డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   12 Sep 2019 11:22 AM GMT
మంచిరోడ్లతోనే ప్రమాదాలు: డిప్యూటీ సీఎం
X
కొత్త వాహన చట్టంతో పడుతున్న జరిమానాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేలు, లక్షల ఫైన్లు చూసి జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన సెగతో తాజాగా కేంద్రం తెచ్చిన కొత్త వాహనచట్టాన్ని గుజరాత్ ప్రభుత్వం సవరణ చేసింది. జరిమానాలను సగానికి తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ తీసుకున్న ఈ చర్యను సమర్థిస్తూ ఇప్పుడు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ సగానికి జరిమానాలు తగ్గించేందుకు రెడీ అయ్యాయి..

ఈ కోవలోనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర మోటారు వాహనచట్ట సవరణకు రెడీ అయ్యింది. దీనిపై సీఎం యడ్యూరప్ప తాజాగా కేబినెట్ భేటి నిర్వహించారు. ఈ భేటి వివరాలను కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా విలేకరులు రోడ్లు బాగుచేయకుండా కనీస వసతులు కల్పించకుండా జరిమానాలు ఎలా వేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని డిప్యూటీ సీఎం గోవింద్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన అసలు రోడ్డు ప్రమాదాలకు మంచి రోడ్లే కారణమన్నారు. మంచి రోడ్లు ఉండడంతోనే వాహనదారులు వేగంగా వెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్లు సరిగా లేని కారణంగా 10వేల మంది చనిపోయారనడం కరెక్ట్ కాదన్నారు. మంచిరోడ్లే ప్రమాదాలకు కారణమని ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ నాట దుమారం రేపాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి.