Begin typing your search above and press return to search.

ఇక‌పై తెలుగులో గూగుల్ వాయిస్ సెర్చ్‌!

By:  Tupaki Desk   |   14 Aug 2017 3:35 PM GMT
ఇక‌పై తెలుగులో గూగుల్ వాయిస్ సెర్చ్‌!
X
ఇక‌పై గూగుల్ లో వాయిస్ క‌మాండ్ తో మ‌న‌కు కావాల‌సిన స‌మాచారాన్ని తెలుగులో కూడా వినే అవ‌కాశాన్ని దిగ్గ‌జ సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ క‌ల్పించింది. తన వాయిస్‌ సెర్చ్‌ సేవలను గూగుల్ భారత్‌లో మరింత విస్తృత పరిచింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌కు తోడుగా మ‌రో 8 ప్రాంతీయ భాష‌లకు వాయిస్ సెర్చ్ సేవ‌ల‌ను విస్త‌రించింది. కొత్త‌గా వాయిస్ సెర్చ్ ప్రారంభించిన‌ 30 భాష‌ల‌లో 8 భార‌తీయ భాష‌లే కావ‌డం విశేషం.

తెలుగు - గుజరాత్‌ - కన్నడ - మరాఠీ - ఉర్దూ - బెంగాళీ - మలయాళం - తమిళం భాషల్లో నేటి నుంచి వాయిస్‌ సెర్చ్‌ సేవలను తీసుకువస్తున్నట్లు గూగుల్‌ టెక్నికల్‌ ప్రోగామ్‌ మేనేజర్‌ డాన్‌ వాన్‌ తెలిపారు. గూగుల్‌ యాప్‌ లో ఉన్న‌ వాయిస్‌ సెట్టింగ్‌ మెనులో వారి వారి భాషలను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా మేం 119 భాషలకు ఇలాంటి సేవలు అందిస్తున్నాం. ఈరోజు 30 కొత్త భాషలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. వీటిలో 8 భారతీయ భాషలున్నాయి.’ అని ఆయ‌న తెలిపారు.

కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన భాష‌లు ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోని గూగుల్ యాప్‌తో పాటు జీబోర్డు యాప్‌ లోనూ ప‌నిచేస్తాయ‌ని గూగుల్ తెలిపింది. ఈ సేవ‌ను ఉప‌యోగించుకోవాలంటే సెట్టింగ్స్‌లో వాయిస్ మెనూలో త‌మ ప్రాంతీయ భాష‌కు ఆప్ష‌న్ మార్చుకోవాలి. ప్ర‌స్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగ‌దార్ల‌కు మాత్ర‌మే ఈ సౌక‌ర్యం ఉంద‌ని, త్వ‌రలోనే ఈ స‌దుపాయాన్ని ఐఓఎస్ వినియోగ‌దారుల‌కు కూడా కల్పించనున్న‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది. ఈ స‌దుపాయం క‌ల్పించ‌డం వ‌ల్ల మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ ఫోన్ కొనుగోళ్లు పెర‌గ‌వ‌చ్చ‌ని గూగుల్ భావిస్తోంది.