Begin typing your search above and press return to search.

గూగుల్, ఫేస్ బుక్ ఆ వార్త‌ల‌కు న‌గ‌దు చెల్లించాల్సిందే!

By:  Tupaki Desk   |   17 July 2022 4:32 AM GMT
గూగుల్, ఫేస్ బుక్ ఆ వార్త‌ల‌కు న‌గ‌దు చెల్లించాల్సిందే!
X
ఇది నిజంగా డిజిట‌ల్ కంటెంట్ ప‌బ్లిష‌ర్ల‌కు శుభ‌వార్తే. గూగుల్, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, ఇన‌స్టాగ్రామ్ వంటివి త‌మ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించే వార్తలకు ఇక నుంచి సంబంధిత డిజిట‌ల్ ప‌బ్లిష‌ర్ల‌కు న‌గ‌దు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం తేనుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా, కెన‌డా, ఫ్రాన్స్ దేశాలు ఈ చ‌ట్టాన్ని తెచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ చ‌ట్టాన్ని తెస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి గూగుల్, ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల‌పై అవి మాత్ర‌మే భారీగా ఆదాయాన్ని దండుకుంటున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. డిజిట‌ల్ ప‌బ్లిష‌ర్స్ కంటెంట్ ను ఉచితంగా వాడుకుంటూ.. యాడ్స్ రూపంలో భారీగా రెవెన్యూను వెన‌కేసుకుంటున్నాయ‌ని గూగుల్, ఫేస్ బుక్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల‌పై విమ‌ర్శ‌లున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆస్ట్రేలియా, కెన‌డా, ఫ్రాన్స్ దేశాలు.. గూగుల్, ఫేస్ బుక్ ల‌కు షాక్ ఇచ్చాయి. డిజిట‌ల్ ప‌బ్లిష‌ర్ వార్త‌ల‌ను త‌మ మాధ్య‌మాల్లో పెట్టుకుని.. భారీ ఆదాయాన్ని గ‌డిస్తున్నందుకు డిజిట‌ల్ కంటెంట్ ప‌బ్లిష‌ర్స్ ఆ మేర‌కు న‌గ‌దు చెల్లించాల్సిందేన‌ని చ‌ట్టాలు చేశాయి.

కాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్రతిపాదిత చట్టం అమలు చేయబడితే.. ఆల్ఫాబెట్ (గూగుల్, యూట్యూబ్ యజమాని), మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని), ట్విట్టర్, అమెజాన్ వంటివి.. భారత‌ వార్తాపత్రికలు, డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లకు ఆదాయంలో వాటా చెల్లించవలసి ఉంటుంది. ఈ కంటెంట్‌ ద్వారా ఆయా టెక్ దిగ్గ‌జ సంస్థ‌లు పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఇలా భారీగా ఆదాయ‌న్ని గ‌డిస్తున్నా కంటెంట్ ప‌బ్లిష‌ర్స్ కు మాత్రం ఆ ఆదాయాన్ని పంచ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం రూప‌క‌ల్ప‌న‌కు సిద్ధ‌మ‌వుతోంది.

కొత్త చ‌ట్టం వ‌స్తే టెక్ దిగ్గ‌జ సంస్థ‌ల గుత్తాధిప‌త్యం న‌శిస్తోంది. డిజిట‌ల్ కంటెంట్ ప‌బ్లిష‌ర్స్ కు మేలు క‌లుగుతుంది. వారు ప‌బ్లిష్ చేసే వార్త‌ల‌కు స్థిరంగా, గ‌ణ‌నీయ‌మైన ఆదాయం ల‌భిస్తుంది. ఈ ఆదాయాన్ని వారి వార్త‌ల వెబ్ సైట్లును మెరుగుప‌ర్చుకోవ‌డానికి, ఉద్యోగుల‌ను నియ‌మించుకోవ‌డానికి, వేత‌నాల‌కు, ఎస్ఈవో ర్యాంకింగ్సును పెంచుకోవ‌డానికి ఉప‌యోగించుకోవ‌చ్చు.