Begin typing your search above and press return to search.

గూగుల్ సీఈవోను టచ్ చేసిన ఆ అమ్మాయి జీరో ట్వీట్

By:  Tupaki Desk   |   23 Nov 2019 4:42 AM GMT
గూగుల్ సీఈవోను టచ్ చేసిన ఆ అమ్మాయి జీరో ట్వీట్
X
పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. సుందర్ పిచాయ్. గూగుల్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన ఒక అమ్మాయి చేసిన ట్వీట్ కు కనెక్ట్ కావటమే కాదు.. ఏకంగా రియాక్ట్ అయ్యారు. అత్యుత్తమ స్థానంలో ఉన్నా.. వార్తల్లో పెద్దగా కనిపించని పిచాయ్.. తాజాగా ఆ అమ్మాయి చేసిన ట్వీట్ కు స్పందించటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి చేసిన ట్వీట్ చూస్తే సాధారణంగానే ఉంటుంది కానీ అంతులేని స్ఫూర్తి ఉంటుంది.

అదే పిచాయ్ ను టచ్ చేసిందేమో? ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటి? అన్నది చూస్తే.. శారాఫినా నాన్స్ అనే యువతి చేసిన ట్వీట్ కు పిచాయ్ రియాక్ట్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం క్వాంటమ్ ఫిజిక్స్ ఎగ్జామ్ లో సున్నా మార్కులు వచ్చాయి. వెంటనే మా ప్రొఫెసర్ ను కలిశాను. ఫిజిక్స్ ను వదిలేసి మరో సబ్జెక్ట్ తీసుకోనా? అని అడిగాను.

ఆయన కూడా అదే నయమన్నట్లుగా నా వంక చూశారు కానీ.. ఈ రోజు నేను ఆస్ట్రోఫిజిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశాను. ఇందుకు సంబంధించిన రెండు పేపర్స్ ను సమర్పించాను కూడా. సైన్స్.. టెక్నాలజీ.. ఇంజనీరింగ్.. మ్యాథ్స్ ఎవరికైనా కొరుకుడుపడదన్న ఆమె..గ్రేడ్ తక్కువ వచ్చినంత మాత్రాన వదిలేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

సదరు యువతి చేసిన ట్వీట్ పిచాయ్ ను అమితంగా ఆకట్టుకుంది. వెంటనే.. ఆ ట్వీట్ కు బదులిస్తూ.. వెల్ సెడ్ అండ్ సో ఇన్ స్పైరింగ్ అంటూ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఓటమి అంటే గెలవకపోవటం కాదు.. గెలిచే వరకూ ప్రయత్నించకపోవటమన్న మాట ఈ ఉదంతాన్ని చూసినంతనే గుర్తుకు రాక మానదు.