Begin typing your search above and press return to search.

గూగుల్ కు భారీ జ‌రిమానా!

By:  Tupaki Desk   |   27 Jun 2017 1:12 PM GMT
గూగుల్ కు భారీ జ‌రిమానా!
X
దిగ్గ‌జ సెర్చ్ ఇంజ‌న్ గూగుల్‌ కు ఎదురుదెబ్బ త‌గిలింది. గూగుల్‌ కు యూరోపియ‌న్ యూనియ‌న్ భారీ జ‌రిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న‌ షాపింగ్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉండ‌డంతో గూగుల్‌ పై ఈయూ చ‌ర్యలు తీసుకుంది. అంతే కాకుండా, 90 రోజుల‌లోగా నిబంధ‌న‌ల‌కు అణుగుణంగా షాపింగ్ స‌ర్వీస్ ను అందించాల‌ని ఆదేశించింది.

వినియోగ‌దారులు ఏవైనా వ‌స్తువుల కోసం గూగుల్‌ లో సెర్చ్ చేసిన‌పుడు ఆ వ‌స్తువుల‌ను అందించే సంస్థ‌లు - ఈ కామ‌ర్స్ వెబ్‌ సైట్ల వివ‌రాలు షాపింగ్ స‌ర్వీస్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. కానీ, గూగుల్ మాత్రం త‌న‌కు అనుకూలంగా ఉండే కొన్ని సంస్థలు - వెబ్‌ సైట్ల వివ‌రాల‌ను మాత్ర‌మే సెర్చ్ రిజ‌ల్ట్స్‌ లో మొద‌ట చూపిస్తోంద‌నేది అందిస్తోంద‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. గూగుల్ త‌మ సెర్చింజ‌న్‌ లో చూపించిన ఆన్‌ లైన్ షాపింగ్‌ స‌ర్వీస్ సంస్థ‌ల పేర్లు ఇత‌ర సంస్థ‌ల‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో యూరోపియ‌న్ యూనియ‌న్ సుదీర్ఘ విచార‌ణ జ‌రిపింది. చివ‌ర‌కు గూగుల్ అందిస్తోన్న ఆ స‌ర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చింది. దీంతో, ఈయూ ఆ సంస్థ‌కి ఏకంగా 2.4 బిలియ‌న్ యూరోల జ‌రిమానా విధించింది.

అయితే, కేవ‌లం వినియోగదారుల సౌక‌ర్యం కోస‌మే ఆ విధంగా రిజ‌ల్ట్స్‌ ను చూపిస్తున్నామ‌ని, వాటి ద్వారా వినియోగ‌దారులకు ల‌బ్ది చేకూరుతోంద‌ని గూగుల్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ఈయూ నిర్ణ‌యంపై అపీల్ చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/