Begin typing your search above and press return to search.

గూగుల్ కు 25 వేల కోట్ల జరిమానా?

By:  Tupaki Desk   |   16 May 2016 10:05 AM GMT
గూగుల్ కు 25 వేల కోట్ల జరిమానా?
X
ప్రఖ్యాత సంస్థ, వరల్డ్ టాప్ సెర్చింజన్ గూగుల్ కు భారీ జరిమానా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెటిజన్లు గూగుల్ లో ఏదైనా వెతికేటప్పుడు తమకు అనుకూలమైన కంపెనీల గురించిన వివరాలు ముందు కనిపించేలా గూగుల్ సాఫ్ట్ వేర్ ను మార్చిందని.. ప్రత్యర్థి కంపెనీలను దెబ్బతీయడమే గూగుల్ ఉద్దేశమని పేర్కొంటూ గూగుల్ కు వ్యతిరేకంగా ఒక కేసు దాఖలైంది. ఆ కేసులో యూరోపియన్ యూనియన్ కాంపిటేటివ్ కమిషన్ ముందు విచారణ ముగిసింది. తీర్పు గూగుల్ కు వ్యతిరేకంగా రాబోతోందని ప్రపంచంలోని పలు మీడియాల్లో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ కేసులో గూగుల్ కు వ్యతిరేకంగా తీర్పు రానుండడమే కాకుండా 3 బిలియన్ యూరోలు అంటే దాదాపు 25 వేల కోట్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో జరిమానాపై తుది నిర్ణయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. జరిమానా విధించడమే కాకుండా సెర్చి రిజల్ట్సు విషయంలో గూగుల్ కు ఉన్న అదికారాలకు కూడా కత్తెర వేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కోర్టు నియమాలు ఫ్రేమ్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

విచారణలో భాగంగా సెర్చింజన్ పరిశీలించిన సమయంలో మొదటి స్థానంలో నిలిచిన కంపెనీలపై 10 శాతం జరిమానాగా సుమారు రూ. 2,300 కోట్లు విధించవచ్చని తెలుస్తోంది. మరోవైపు సెర్చు రిజల్ట్సే కాకుండా ట్రావెల్ ఇన్ఫర్మేషన్, మ్యాపుల విషయంలోనూ గూగుల్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలోనూ గూగుల్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.