Begin typing your search above and press return to search.

భారత్ తో ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్?

By:  Tupaki Desk   |   13 July 2020 4:30 PM GMT
భారత్ తో ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్?
X
2014లో అటు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, ఇటు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఒకేసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి భారత్ తో దౌత్య, వ్యూహాత్మక, పలు రకాల సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఇరు దేశాధినేతలు ముందుకు వచ్చారు. హౌడీ మోడీ అంటూ ట్రంప్...మోడీకి అమెరికాలో రెడ్ కార్పెట్ వేశారు. అదే రేంజ్ లో నమస్తే ట్రంప్ అంటూ ట్రంప్ నకు మోడీ భారత్ లో మరచిపోలేని ఆతిథ్యమిచ్చారు. అయితే, వాణిజ్య పరమైన వ్యవహారాల్లో మాత్రం ట్రంప్...పెద్దగా సడలింపులు ఇవ్వడానికి మొగ్గు చూపలేదని పలు సందర్భాల్లో స్పష్టమైంది.

అయితే, అమెరికాలో మన దేశానికి చెందిన లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఉండడం...హెచ్ వన్ బీ వీసాలపై ట్రంప్ లోకల్ సెంటిమెంట్ ప్రభావం పడే అవకాశం ఉండడం వంటి కారణాలతో భారత్ కూడా వాణిజ్య వ్యవహారాల్లో ట్రంప్ సర్కార్ పై దూకుడు ప్రదర్శించలేదు. అయితే, తాజాగా చైనాతో భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో మన వెంటే ఉన్నామని భరోసా కల్పిస్తున్న అమెరికా...భారత్ విధించిన గూగుల్ ట్యాక్స్ విషయంలో మాత్రం గుర్రుగా ఉంది. ఓ వైపు మనకు మద్దతు తెలుపుతనే...మరోవైపు చైనాతో వ్యాపారానికి ట్రంప్ తెరలేపినట్లు తెలుస్తోంది. చైనాతో ఓ భారీ వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిద్దమవుతున్నారని ట్రంప్ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ అన్నారు. ఈ ప్రకటనతో అమెరికా అసలు బుద్ధి బయట పడినట్లయింది.

కరోనా సంక్షోభంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అయితే, కరోనాకు ముందే 2016-17 నుంచి గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సంస్ధల ఆదాయంపై భారత్ 6 శాతం గూగుల్ ట్యాక్స్ విధించింది. అమెరికన్ డిజిటల్ కంపెనీలపై భారత్ తోపాటు మరో 9 దేశాలు ఈ తరహ పన్ను విధిస్తున్నాయి. దీంతో, గూగుల్ ట్యాక్స్ విధిస్తోన్న ఫ్రాన్స్ నుంచి దిగుమతులపై 25 శాతం అదనపు డ్యూటీలు విధించారు ట్రంప్. త్వరలోనే మిత్రదేశమని ట్రంప్ చెప్పుకునే భారత్ పై కూడా ఇదే తరహా అదనపు డ్యూటీ విధించబోతున్నారట. మరోవైపు, కరోనా నేపథ్యంలో హెచ్ వన్ బీ వీసాలకు ఉద్వాసన పలికేందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. భారత్ కు చెందిన దాదాపు 6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా జీఎన్‌పీ నుంచి తొలగించింది.

దానికి దీటుగా అమెరికా వస్తువుల దిగుమతులపై భారత్ పన్నులు పెంచింది. ఈ సందర్భంలో గూగుల్ ట్యాక్స్ కోసం పట్టుబట్టడం ఎందుకని భారత్ వేచిచూస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను వాణిజ్యపరంగా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే....ఇప్పటికే లోకల్ సెంటిమెంట్ బలంగా ఉన్న ట్రంప్....హెచ్ 1బీ వీసాల విషయంలో భారత్ ను దెబ్బకొట్టేందుకు వెనుకాడరన్నది అక్షర సత్యం. బలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను ఢీకొనే సత్తా భారత్ కు దాదాపుగా లేదనే చెప్పాలి. ఇటువంటి సందర్భంలో గూగుల్ ట్యాక్స్ లేదా డిజిటల్ ట్యాక్స్ కోసం గట్టిగా పట్టుబట్టే పరిస్థితిలో భారత్ లేదు. ఈ విషయంలో భారత్ ఎలా ముందుకు పోతుందన్నది ఆసక్తికరంగా మారింది.