Begin typing your search above and press return to search.

నారదుడి ముందు గూగుల్ ఎంత - సీఎం

By:  Tupaki Desk   |   1 May 2018 7:11 AM GMT
నారదుడి ముందు గూగుల్ ఎంత - సీఎం
X
బీజేపీ నేత మ‌రో కొత్త సూత్రీక‌ర‌ణ చేశారు. అది కూడా చోటా మోటా నాయ‌కుడేం కాదు..సాక్షాత్తు ముఖ్య‌మంత్రి అది కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇలాకా అయిన‌ గుజరాత్ ముఖ్యమంత్రి. గుజ‌రాత్ సీఎం విజయ్‌ రూపానీ నారదముని జయంతి సందర్భంగా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

`ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన గురించి నారద మహర్షి వద్ద సమాచారం ఉండేది. ప్రస్తుతం అవసరమైన అంశం కూడా ఇదే. లోకకల్యాణం కోసం - మానవాళికి మంచిచేయడం కోసం సమాచార సేకరణను నారదముని తన ధర్మంగా పాటించేవారు. అప్పుడు నారదముని సమాచారాన్ని ఎలా పంచేవారో.. ఇప్పుడు గూగుల్ కూడా సమాచారానికి కీలక వనరుగా మారింది. మానవాళికి హాని తలపెట్టే పనిని నారదముని ఎప్పుడూ చేయలేదు.` అని వివ‌రించారు.

ఆర్‌ ఎస్‌ ఎస్‌ అనుబంధ మీడియా విభాగం ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జర్నలిస్టులను సత్కరించిన సందర్భంగా గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. `నారదుడు తరచూ ప్రజల పై నిఘా పెట్టినా నిజానికి మాత్రం ప్రజల క్షేమానికి ఉపయోగపడే విషయాలను మాత్రమే పంచేవాడు. జర్నలిస్టులు కూడా నారదలాగే ఉండాలి. ప్రజలకు మంచి చేసే విషయాలనే ప్రసారం చేయాలి' అని అన్నారు. ఇటీవల కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న అసంబద్ధ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇంటర్నెట్‌ - అధునాతన శాటిలైట్‌ వ్యవస్థ మహాభారత కాలంలోనే ఉన్నదని రెండు వారాల క్రితం త్రిపుర సీఎం బిప్లబ్‌ దేబ్‌ చేసిన వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసులకు మెకానికల్‌ ఇంజనీర్లు సరికారని - సివిల్‌ ఇంజనీర్లు మాత్రమే దీనిని ఎంచుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలపాలైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ - బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, మీడియాకు మసాల అందించవద్దని బీజేపీ నాయకులకు మోడీ సూచించనప్పటికీ ఇటువంటివి చోటుచేసుకోవడం గమనార్హం. పైగా తాజాగా సొంత రాష్ట్రం ముఖ్య‌మంత్రే ఇలాంటి కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.