Begin typing your search above and press return to search.
తెలంగాణలో గూగుల్ వెయ్యి కోట్లు పెట్టుబడి!
By: Tupaki Desk | 12 May 2015 7:58 AM GMTతెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 5వ తేదీన యూఎస్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే! అందులో భాగంగా అమెరికాలోని పలు కంపెనీలు, సంస్థల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ గూగుల్ సంస్థ ప్రతినిధులతోనూ భేటీ ఆయ్యారు. ఈ భేటీ అనంతరం... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుపడులు పెట్టేందుకు చాలా సంస్థలు ఇప్పటికే ముందుకొస్తున్నాయని, ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఆకర్షణ మంత్రాలు వేస్తుందని చెప్పిన కేటీఆర్... ఇదే క్రమంలో ప్రపంచప్రఖ్యాత సంస్థ గూగుల్ కూడా తెలంగాణ లో పెట్టుబడిపెట్టేందుకు అంగీకరించిందని ప్రకటించారు!
వచ్చే నాలుగేళ్లలో హైదరాబాద్ లో వెయ్యి కోట్లు రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ అంగీకరించినట్లు అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాడ్ క్లిఫ్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న గూగుల్ సిబ్బందిని 6500 నుంచి 13000 పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యార్దుల్లో మెరుగైన నైపుణ్యాలను పెంచేందుకు హైదరాబాద్ లో త్వరలోనే భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నామని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆసియాలో ఇదే అతిపెద్ద క్యాంపస్ అవుతుందని ప్రకటించారు.