Begin typing your search above and press return to search.

దేశంలో సంక్షోభం ఉందంటున్న గాంధీ వార‌సుడు

By:  Tupaki Desk   |   12 July 2017 10:47 AM GMT
దేశంలో సంక్షోభం ఉందంటున్న గాంధీ వార‌సుడు
X
త్వ‌ర‌లో జ‌రిగే ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న గోపాల‌కృష్ణ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ప‌లు అంశాల్లో సంక్షోభం నెల‌కొంద‌ని అన్నారు. ఇవి తొల‌గిపోయిన‌ప్పుడే సామాన్యుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. గోపాల‌కృష్ణ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ల‌న అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు ప‌లికిన 18 ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాను ఓ పౌరుడిగా ఎన్నిక‌ల్లో పోటీప‌డుతున్న‌ట్లు, రాజ‌కీయ‌వేత్త‌గా కాదు అని గాంధీ అన్నారు. దేశ భ‌విష్య‌త్తు ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు. దేశంలో ఉగ్ర స‌మ‌స్య‌లు, భ‌యం, వ్య‌వ‌సాయ సంక్షోభం ఉంద‌న్నారు. ప్ర‌జాస్వామ్య సంస్థ ప‌ట్ల విశ్వాసం ఉండాల‌ని గోపాల‌కృష్ణ గాంధీ ఆకాంక్షించారు.

కాగా, మహాత్మాగాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ అయిన‌ గోపాలకృష్ణగాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 18 ప్రతిపక్ష పార్టీలు ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలో మంగళవారం సమావేశమైన విపక్షాల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి జనతాదల్ (యూ) నాయకుడు శరద్ యాదవ్ కూడా హాజరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అధికార ఎన్డీయేకు మద్దతు పలికిన జేడీయూ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మాత్రం ప్రతిపక్షాల వెంట నడిచింది. ప్రతిపక్షాల సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ, పద్దెనిమిది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు సమావేశమయ్యాం. అందరూ కలిసి గోపాలకృష్ణ గాంధీని సంయుక్త అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించాం అని చెప్పారు. తమ పక్షాన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు గోపాలకృష్ణగాంధీ కూడా అంగీకరించారని తెలిపారు. తమ ఎంపికను పరిశీలించేందుకు గోపాలకృష్ణకు 15 నిమిషాల గడువునిచ్చామని, ఆలోపే ఆయన తన అంగీకారాన్ని తెలిపారని సోనియా వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా సీతారం ఏచూరి మాట్లాడుతూ గోపాలకృష్ణ జాతిపిత మహాత్మా గాంధీకి, భారత చివరి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలచారికి మనుమడని గుర్తుచేశారు. త‌మ సమావేశంలో ఆయన ఒక్కడి పేరుపైనే చర్చ జరిగిందని, ఏకగ్రీవంగా అందరూ ఆయనకు మద్దతు పలికారని పేర్కొన్నారు. భారత ఉపరాష్ట్రపతి పదవికి గోపాలకృష్ణ గాంధీని మించిన ఉత్తమ అభ్యర్థి మరొకరు దొరుకరని తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ డెరెక్ ఓబ్రియన్ వ్యాఖ్యానించారు. విపక్షాల సమావేశంలో తొలుత గోపాలకృష్ణ పేరును ఓబ్రియన్ ప్రతిపాదించగా, బీఎస్పీకి చెందిన సతీశ్ మిశ్రా - ఏచూరి మద్దతు పలికినట్టు తెలిసింది. నామినేషన్ పత్రాలపై జేడీ(యూ) నాయకుడు శరద్ యాదవ్ సహా నేతలు సంతకాలు చేశారని, త్వరలో వాటిని దాఖలు చేస్తామని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 5న జరుగనుంది. అదేరోజు సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు.