Begin typing your search above and press return to search.

గోరంట్ల ..ఇప్పుడు మారిన మ‌నిషి!

By:  Tupaki Desk   |   9 July 2017 9:30 AM GMT
గోరంట్ల ..ఇప్పుడు మారిన మ‌నిషి!
X
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత - రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొద్దికాలం క్రితం ఫైర్ అయిన తీరు గుర్తుండే ఉంటుంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బెర్తు దొర‌క‌క‌పోవ‌డంతో ఓ రేంజ్‌ లో టీడీపీ అధిష్టానంపై, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుపై మండిప‌డ్డారు. పార్టీ కార్య‌క‌లాపాల‌కు సైతం దూరంగా ఉంటూ క‌ల‌క‌లం రేకెత్తించారు. అలాంటి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం - తెలుగుదేశం పాల‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. న‌దుల అనుసంధానం చేసిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుద‌ని ప్ర‌శ్నించారు. గోదావరి నుండి వృథాగా సముద్రం పాలవుతున్న జలాలనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకెళ్ళి కృష్ణా డెల్టాను కాపాడుతున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టి పట్టిసీమ పథకం వల్ల గత రెండేళ్ల కాలంలో కృష్ణా డెల్టాలో సుమారు రూ.7500 కోట్ల విలువైన పంటను కాపాడామన్నారు. పట్టిసీమ ద్వారా ఇంతటి ప్రయోజనం కలుగుతున్నా వైసిపి నేతలు - మేధావిగా భావించే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ సంకుచిత విమర్శలు చేస్తున్నారన్నారు.

పట్టిసీమ వృథా ప్రాజెక్టు అని నిరూపిస్తానని, చర్చకురావాలని గతంలో సవాల్ చేసిన ఉండవల్లి ఈ నెల 18వ తేదీన కృష్ణా బ్యారేజిపై చర్చకు రావాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆహ్వానించారు. కృష్ణా డెల్టా రైతుల సాక్షిగా పట్టిసీమ ప్రయోజనాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ధవళేశ్వరం బ్యారేజిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి జల వనరుల శాఖ అధికారులతో కలసి ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి నదిలో వృథాగా పోయే జలాలను ఇటు డెల్టాలకు - అటు పట్టిసీమకు వినియోగించుకోవడం జరుగుతోందన్నారు. గత రెండేళ్ల కాలంలో కృష్ణాలో - గోదావరి బేసిన్‌ లో ఆశించినంతగా వర్షాలు పడలేదని, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు యుద్ధ ప్రాతిపదికన ఏడాది కాలంలోనే పట్టిసీమ పథకాన్ని పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాలకు నీరందించారన్నారు. ఈ నీటితో గత రెండేళ్లలో సుమారు రూ.7500 కోట్ల విలువైన పంటలను కాపాడామన్నారు. మొదటి ఏడాది సుమారు రూ.2500 కోట్లు - రెండో ఏడాది రూ.5000 కోట్ల విలువైన పంటలను కాపాడగా, ఈ ఏడాది ముందస్తు ఖరీఫ్‌ లో భాగంగా ఇప్పటి వరకు 9 టిఎంసిల నీటిని పట్టిసీమ ద్వారా తరలించారని వివరించారు. గోదావరి నది నుంచి మూడు డెల్టాలకు, పట్టిసీమకు కలిపి 228 క్యూసెక్కుల జలాలను వినియోగించుకుంటుంటే, దాదాపు 2500 టిఎంసిల జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయన్నారు. కృష్ణాపై ఎగువ ప్రాంతంలో ఆల్మట్టివల్ల 130 టిఎం సిల నీటిని వినియోగించుకుంటుంటే, నారాయణపూర్‌ లో 38 టిఎంసిలు, జూరాలలో 10 టిఎంసిలు, శ్రీశైలంలో 216 టిఎంసిలు వినియోగించుకోవడం వల్ల అక్కడ నుంచి పులిచింతలకు రావాలంటే నీటికి కటకటలాడే పరిస్థితి దాపురించిందన్నారు. నాగార్జున సాగర్‌ లో 312 టిఎంసిలు వినియోగించుకుంటే అడ్డంకులన్నీ దాటుకుని కిందకు నీరు రావాలంటే గగనమేనన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం పూర్తయ్యేలోపు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. జూన్ చివరి వారానికి నీరిచ్చి ముందస్తు ఖరీఫ్‌ను సాకారం చేశారన్నారు. ఈ ఏడాది 80 టిఎంసిల గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను కాపాడతామన్నారు. పట్టిసీమ వృథా అనే మేధావులు దీనికి ఏమి సమాధానం చెపుతారని బుచ్చియ్య ప్రశ్నించారు.

కళ్లుండి చూడలేని కబోదులు మాదిరిగా ఉండవల్లి - వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని బుచ్చ‌య్య చౌద‌రి దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేలోపు కృష్ణా డెల్టాలో దాదాపు రూ.10వేల కోట్ల విలువైన పంటలను కాపాడనున్నట్టు చెప్పారు. పట్టిసీమ నిర్మాణానికి చేసిన వ్యయం మొదటి ఏడాదిలోనే వచ్చేసిందని, వచ్చే ఏడాదికి పురుషోత్తపట్నం నుంచి ఏలేరు ఆయకట్టును స్థిరీకరించడం జరుగుతుందని బుచ్చయ్య పేర్కొన్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద వరద జలాలు సముద్రంలోకి విడుదల చేయడం, అనంతరం పట్టిసీమ ద్వారా విడుదలైన నీరు పోలవరం కుడి కాల్వ ద్వారా పంపిణీ జరుగుతున్న ప్రాంతాలను ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు స్వయంగా చూపించారు. కాగా, ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన బుచ్చ‌య్య చౌద‌రి తీరు గ‌మ‌నించిన ప‌లువురు..కొద్దికాలం క్రితం ఈయ‌నేనా స‌ర్కారుపై దుమ్మెత్తి పోసింది అంటూ చ‌ర్చించుకున్నారు.