Begin typing your search above and press return to search.

గోరంట్ల బెదిరింపుల‌కు ఎన్నెన్నో కార‌ణాలు.. ఇవే ?

By:  Tupaki Desk   |   19 Aug 2021 9:30 AM GMT
గోరంట్ల బెదిరింపుల‌కు ఎన్నెన్నో కార‌ణాలు.. ఇవే ?
X
తెలుగుదేశం పార్టీలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపారు.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌.. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలను ఎదుర్కొని మ‌రీ పార్టీలోనే కొన‌సాగుతోన్న ఆయ‌న కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మాట వాస్త‌వం. విచిత్రం ఏంటంటే గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏపీలో మ‌హామ‌హులు జ‌గ‌న్ వేవ్‌లో కొట్టుకుపోయారు. అయితే బుచ్చ‌య్య చౌద‌రి మాత్రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. ఇందుకు జ‌న‌సేన అక్కడ భారీగా ఓట్లు చీల్చ‌డం కూడా ఓ కార‌ణం. మొత్తంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చ‌య్య చౌద‌రి పార్టీలో ఎంతో సీనియ‌ర్‌.. ఎప్పుడూ క్ర‌మ‌శిక్ష‌ణ గీత దాటేందుకు కూడా ఆయ‌న ఇష్ట‌ప‌డేవారు కాదు..!

ఇక ఇటీవ‌ల చంద్ర‌బాబు, లోకేష్ వ‌ద్ద ఆయ‌న ప్ర‌యార్టీ త‌గ్గిపోయింది. బుచ్చ‌య్య ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక లోకేష్ ఇప్పుడు పార్టీని డీల్ చేస్తున్నారు. బుచ్చ‌య్య లాంటి సీనియ‌ర్ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే ఆయ‌న‌లో ఉన్న బ‌డ‌బాగ్ని బ‌ద్ద‌ల‌య్యేందుకు కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే గురువారం ఆయ‌న పార్టీకి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేయబోతున్నట్టు వార్త‌లు రావ‌డంతో టీడీపీలో ఒక్క‌సారిగా తీవ్ర క‌ల‌క‌లం రేగింది.

బుచ్చ‌య్య అల‌క‌కు మ‌రో కార‌ణం కూడా ఉంది. ఆయ‌న‌కు 2014 ఎన్నిక‌ల్లో ఇష్టం లేకపోయినా కూడా బ‌ల‌వంతంగా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో తిరిగి సిటీకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించినా ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం బుచ్చ‌య్య‌ను మ‌ళ్లీ రూర‌ల్ నుంచే పోటీ చేయించారు. ఇక ఇప్పుడు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో బుచ్చ‌య్య కేడ‌ర్‌ను ఆదిరెడ్డి ఫ్యామిలీ అణ‌గ‌దొక్కుతోంద‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న చేస్తున్నారు. ప‌లు పార్టీలు మారిన వారిని అంద‌లం ఎక్కిస్తూ.. పార్టీ ఆవిర్భావం నుంచి .. ఎంతో నిజాయితీతో ఉన్న త‌న‌ను ఈ విధంగా ఇబ్బందుల‌కు గురి చేయ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు.

దీనికి తోడు చంద్ర‌బాబు, లోకేష్ ఫోన్లు చేసినా స్పందించ‌డం లేద‌న్న ఆవేద‌న సైతం ఆయ‌న‌లో ఉంది. ఓ వైపు ఆయ‌న పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో పాటు వేరే పార్టీలోకి వెళ్లిపోతార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు. టీడీపీకి రాజీనామాపై తాను ఇప్పుడే ఏం మాట్లాడ‌న‌ని చెప్పారు. ఇక కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న త‌న రాజ‌కీయ వార‌సుడిగా సోద‌రుడి కుమారుడు డాక్ట‌ర్ ర‌విని రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని చూశారు. అయితే ఇప్పుడు పార్టీలో జ‌రుగుతోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న ఆ ఆలోచ‌న కూడా విర‌మించుకున్నార‌ని అంటున్నారు.

ఇవ‌న్నీ చూసి చూసి విసిగిపోయిన ఆయ‌న చివ‌ర‌కు రాజీనామా బెదిరింపుల‌కు దిగిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ వ‌య‌స్సులో బుచ్చ‌య్య టీడీపీని వీడ‌తార‌ని అనుకోలేం.. అయితే ఆయ‌న త‌న అసంతృప్తిని ఈ విధంగా బ‌య‌ట పెట్టుకున్నారు.