Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు చెమటలు పట్టించిన గోరంట్ల డిమాండ్లు బయటకొచ్చాయ్

By:  Tupaki Desk   |   20 Aug 2021 3:30 PM GMT
చంద్రబాబుకు చెమటలు పట్టించిన గోరంట్ల డిమాండ్లు బయటకొచ్చాయ్
X
అధికారంలో ఉన్నప్పుడు ఒకలాంటి బిజీ.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలాంటి తీరికలేనితనంతో కిందా మీదా పడుతుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీని కాపాడుకుంటానని.. పార్టీ జెండా ఎత్తిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తానని.. వారి జీవితాల్ని బాగు చేస్తానంటూ తెగ కబుర్లు చెప్పే చంద్రబాబు మాటలకు చేతలకు మధ్య తేడా ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. పార్టీకి నష్టం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పే చంద్రబాబు.. ఇప్పటివరకు ఎవరిమీదనైనా చర్యలు తీసుకున్నారో చెప్పండి? అంటూ ప్రశ్నిస్తుంటారు తెలుగు తమ్ముళ్లు. వారి మాటలకు తగ్గట్లే బాబు తీరు ఉంటుందని చెప్పాలి.

తాజాగా సీనియర్ నేత కమ్ ఫైర్ బ్రాండ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాబు తీరుపై కినుకు వహించటం.. వారం వ్యవధిలో పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన ఆయన మాటలు షాకింగ్ గా మారటమే కాదు.. సంచలనంగా మారాయి. ఇక అధినాయకుడికి అయితే ఏకంగా చెమటలు పట్టించాయని చెబుతారు. అందుకే.. యుద్ధ ప్రాతిపదికన ఫోన్ చేసి ఇరవై నిమిషాల పాటు మాట్లాడి.. తొందరపడ్డొద్దని కోరినట్లు చెబుతారు. పార్టీకి మంచి ఫ్యూచర్ ఉందని నమ్మబలుకుతూ.. తొందరపాటు వద్దని చెప్పినట్లు చెబుతారు.

అంతేకాదు.. బుచ్చయ్య అలకకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆయన.. వాటిని త్వరలోనే సెట్ చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్లే.. తన తీరుకు కాస్త భిన్నంగా బుచ్చయ్య వద్దకు త్రిసభ్య బృందాన్ని ఆయన ఇంటికి పంపారు. బాబు దూతలుగా వచ్చిన వారు.. దాదాపు గంటన్నర పాటు మాట్లాడి.. ఆయన్ను బుజ్జగించేందుకు కిందా మీదా పడినట్లు చెబుతున్నారు. ఈ టీంలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు.. నిమ్మకాయల చినరాజప్ప.. జవహర్ లు ఉన్నారు. వీరంతా కలిసి బుచ్చయ్య ఆగ్రహాన్ని తగ్గించి.. ఆయన అలకకు కారణమైన అంశాల్ని కనుగొన్నారు.

వాటిని అధినేత ముందు ఉంచుతామని..ఆయన కోరినట్లుగా చర్యలు ఉంటాయన్న హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి పార్టీలో నెలకొన్న ఇబ్బందుల గురించి బచ్చయ్య చెప్పినట్లుగా గద్దె రామ్మోహన్ రావు మీడియాకు చెప్పారు. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు చూసుకుంటారని చెబుతున్నారు. అంతేకాదు.. రాజమండ్రి అర్బన్ లో బుచ్చయ్య చౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవటంతోపాటు.. ఆదిరెడ్డి అప్పారావుతో ఉన్న విభేదాల్ని సెట్ చేయాల్సిన అవసరాన్ని త్రిసభ్య కమిటీ గుర్తించినట్లు చెబుతున్నారు. మరి.. తాజా బుజ్జగింత బుచ్చయ్య చౌదరి అలకను పూర్తిగా తీర్చాయా? లేదా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.